బీజేపీకి జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అసలే అరకొర మెజారిటీ, మిత్రపక్షాల సహకారంతో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ..ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలిచి తమకు అడ్డేలేదని చాటేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. బీజేపీకి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ కూడా అదే పనిగా కష్టపడుతోంది.
జమ్మూ కశ్మీర్, హర్యానాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 90. ఇందులో మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే 46సీట్లు గెలుపొందాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి రెండు చోట్లా ఆశలు మిణుకుమిణుకు అంటున్నాయి. హర్యానాలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీకి అక్కడ రైతు వ్యతిరేక చట్టాలు, రెజ్లర్ల ఆందోళనలు ఆ పార్టీ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో హర్యానా హస్తం ఖాతాలో చేరడం పక్కా అని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక , జమ్మూలో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ తో జత కట్టగా….బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగాల్సి వచ్చింది. కాంగ్రెస్ కు అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ తోడు కావడంతో ఆ పార్టీకి గెలుపు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అక్కడ అంతా ఆర్టికల్ 370రద్దును వ్యతిరేకించిన వారే కావడంతో బీజేపీ..అక్కడ అధికారం చేపట్టే స్థాయిలో సీట్లు దక్కించుకోవడం కష్టమే.
ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితం బీజేపీకి ప్రతికూలంగా వస్తే… ఆ తర్వాత జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై కూడా ఆ ప్రభావం పడుతుంది. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ – కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి.