రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పదవుల కోసం నిరీక్షిస్తున్న ద్వితీయ శ్రేణి నేతల పరిస్థితి చూస్తే ఒకోసారి అయ్యో అనిపిస్తుంది. వారు ఆయా పార్టీలను అధినేతలను నమ్ముకుని చిరకాలంగా వుంటున్నవారే. ఎప్పటికప్పుడు ఏవో వాగ్దానాలు పొందినవారే. అయినా సరే ప్రభుత్వాలు ఏర్పడి రెండేళ్లు గడిచినా పదవీ ప్రాప్తం లేక సమీప భవిష్యత్తుపై సంకేతాలు లేక సతమతమవుతున్నారు. ఇలాటి వారు సన్నిహితులతో చెప్పే మాటలు వింటే నాయకులను గత్యంతరం లేక నాయకులను నమ్మడం తప్ప నిజంగా ఆశలు వదులుకున్నారనే అనిపిస్తుంటుంది. అర్థమనస్కంగా అధినేతలను సమర్థిస్తూ.. అసంతృప్తిని దిగమింగుకుంటూ .. ఆర్థిక భారాలు భరిస్తూ నెట్టుకొస్తుంటారు. అప్పుడప్పుడు అధినేతలకు వారి వారసులకు గుర్తు చేస్తుంటే ‘మాకు తెలియదా.. నీకెందుకు నే చూసుకుంటా కదా’ అని మాటలు వస్తుంటాయి. అయితే అవి జరిగేవి కావని వీరికీ తెలుసు.అయినా మరో మార్గం లేక వాటినే నమ్మలేక నమ్ముతూ హౌప్ ఆగైనెస్ట్ హౌప్ అన్నట్టు గడుపుతుంటారు. పైగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి తమలాగా నమ్మకస్తులు కాని వారికి అసమర్థులకు అమాంతం పదవులు కట్టబెట్టి మమ్ముల్ను నిర్లక్ష్యం చేస్తున్నారే అన్న బాధ తొలిచేస్తుంటుంది. పైగా ఇందుకోసం తిరగడం, కలవడం బోలెడు ఖర్చు. దానికీ ఠికాణా వుండదు. తుది ఫలితం అగమ్యం గనక నిరీక్షణే మిగులుతుంటుంది. పదవులు ఇచ్చేదుంటే ఇచ్చేస్తే లేక ఫలానా సమయం అని చెప్పేస్తే ఇలాటి అసహాయ ఆశావహులు ఆనందిస్తారు .టిఆర్ఎస్కూ టిడిపికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. రాజకీయాలు ప్రజాసేవ కోసం తప్ప పదవుల కోసం కాదనేది నిజమే గాని మీకు నచ్చిన వారందరికీ పందేరం చేసి మమ్ముల్నే పక్కనపెట్టడం ఏం న్యాయమన్నది వీరు అడగలేని ప్రశ్న.