‘బింబిసార’… కల్యాణ్ రామ్ కెరీర్ని నిలబెట్టిన సినిమా. కమర్షియల్గా పెద్ద హిట్టు కొట్టింది. ‘బింబిసార’ సమయంలోనే పార్ట్ 2 తీస్తామని కల్యాణ్ రామ్ ప్రకటించారు. అయితే… ఈ ప్రాజెక్ట్ నుంచి అనూహ్యంగా వశిష్ట తప్పుకొన్నారు. ఇప్పుడాయన చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఆ తరవాత కూడా ప్లానింగ్ గట్టిగానే ఉంది. రామ్ చరణ్, రజనీకాంత్.. ఇలా స్టార్ హీరోలతో ప్రాజెక్టుల్ని సెట్ చేసుకొంటున్నారు. అంటే… ప్రస్తుతం వశిష్ట కల్యాణ్ రామ్ కు అందుబాటులో లేడన్నమాట.
అందుకే పార్ట్ 2కి అనిల్ ని దర్శకుడిగా ఎంచుకొన్న కల్యాణ్ రామ్.. ప్రస్తుతం ‘బింబిసార 2’ కథని వండుతున్నారు. అయితే మరోవైపు వశిష్ట కూడా ‘బింబిసార 2’ కథని రెడీ చేసేసినట్టు టాక్. ‘బింబిసార’ చేస్తున్నప్పుడే వశిష్ట దగ్గర పార్ట్ 2 ఆలోచన ఉంది. అది ఇప్పుడు పూర్తి స్థాయిలో డవలెప్ అయ్యింది. కల్యాణ్ రామ్ తన టీమ్ తో ‘బింబిసార 2’ కథని రెడీ చేయిస్తున్నారు. రెండు నెలల్లో స్క్రిప్టు పూర్తి స్థాయిలో సిద్దం అవుతుంది. నిజానికి వశిష్ట బింబిసార 2 కథ కూడా కల్యాణ్ రామ్ కోసమే రెడీ చేశాడు. కాకపోతే… ఇప్పుడు వశిష్టకూ కల్యాణ్ రామ్ కూ మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్టు అర్థమవుతోంది. కల్యాణ్ రామ్ పిలిచి ‘బింబిసార 2 కథ రెడీ చేయ్’ అంటే… కథ ఇవ్వడానికి వశిష్ట కూడా సిద్దంగానే ఉన్నాడు. కానీ… కల్యాణ్ రామ్ మాత్రం తన సొంత టీమ్ తోనే ‘బింబిసార 2’ కథ తయారు చేసుకొంటున్నాడు. కల్యాణ్ రామ్ సొంత కథతో ‘బింబిసార 2’ తీసుకొంటే, వశిష్ట తన కథలో చిన్న చిన్న మార్పులు చేసి, మరో హీరోతో పట్టాలెక్కించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా ఒకేసారి ఒకే సినిమాకి రెండు చోట్ల కథలు సిద్ధం అవ్వడం ‘బింబిసార 2’ విషయంలోనే జరిగిందేమో..?