హైదరాబాద్: తెలుగుదేశంపార్టీకి తెలంగాణలో మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యే సాయన్న టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిసి గులాబి కండువా కప్పుకున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు సాయన్నను, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్‌ను కేసీఆర్ దగ్గరకు తోడ్కొని వెళ్ళారు. సాయన్న కంటోన్మెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఆయనను టీటీడీ బోర్డ్ సభ్యుడిగా నియమించిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లాక్కున్న సంగతి తెలిసిందే. తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇప్పటికే గులాబి కండువా కప్పుకున్నారు. ఇప్పుడు తాజాగా సాయన్న వెళ్ళటంతో వివేకానంద, అరెకపూడి గాంధి, మాగంటి గోపీనాథ్, ప్రకాష్ గౌడ్, ఆర్. కృష్ణయ్య మాత్రమే మిగిలారు. కొద్ది రోజుల్లో జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తర్వాత రాబోతున్నజీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే టీఆర్ఎస్ మళ్ళీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ కార్యక్రమాన్ని చేపట్టి వీరిని లాక్కుంటున్నట్లుగా కనబడుతోంది.
టీఆర్ఎస్లోకి చేరిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి తాను టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు సాయన్న చెప్పారు. వరసగా మూడు సార్లునుంచి ప్రతిపక్షంలో ఉంటున్నానని, దీనివలన నియోజకవర్గంలో పనులు జరగటంలేదని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి తనకు ముఖ్యమని చెప్పారు. హైదరాబాద్‌కు నీటి దాహం తీరటం, గోదావరి జలాలను తీసుకురావటం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళువంటి కార్యక్రమాలు చూసి తాను టీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సైన్యం కొన్ని రోడ్లను మూసేస్తామని ప్రకటించగా, దానిని కేసీఆర్ నిలిపివేయించారని చెప్పారు. టీడీపీ తనకు అన్యాయమేమీ చేయలేదని అన్నారు. అటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, నిరంతర విద్యుత్, గోదావరి జలాలు, డబుల్ బెడ్రూమ్ వంటి ప్రభుత్వ చర్యలు చూసి తాను టీఆర్ఎస్లోకి చేరుతున్నట్లు తెలిపారు. కేసీఆర్‌కు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కసి, తపన ఉన్నాయని అన్నారు.
మరోవైపు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా టీఆర్ఎస్లోకి చేరుతున్నట్లుగా వీ6 వంటి కొన్ని ఛానల్స్ ఇవాళ స్క్రోలింగ్ ఇచ్చాయి. అయితే ఆ వార్తలను ప్రకాష్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. తల్లిలాంటి టీడీపీని వదిలే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. కుట్రపూరితంగా ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.