మధ్యప్రదేశ్లో మంగళవారం రాత్రి 11.45గంటలకు జరిగిన ప్రమాదాలలో చనిపోయినవారి సంఖ్య 31కు చేరింది. మరో 70 మంది గాయపడ్డారు. కామయాని ఎక్స్ప్రెస్, జనతా ఎక్స్ప్రెస్ రైళ్ళు ఒక వంతెన దాటుతుండగా పట్టాలుతప్పి నదిలో పడిపోయాయి. ముంబై నుండి వారణాసి వెళుతున్న కామయాని ఎక్స్ ప్రెస్ నదిపై ఉన్న వంతెన మీదకు రాగానే పట్టాలు తప్పింది. ఇంజనుతో సహా 10 బోగీలు నదిలో పడిపోయాయి. ఆ తరువాత మరికొన్ని క్షణాల వ్యవధిలోనే అదే వంతెనపైకి రెండవ వైపు నుండి ప్రవేశించిన జబల్ పూర్ నుండి ముంబై వెళుతున్న జనతా ఎక్స్ ప్రెస్ కూడా పట్టాలు తప్పడంతో ఇంజనుతో సహా 5 బోగీలు నదిలో పడిపోయాయి. గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో మాచక్ నదికి వరద వచ్చింది. నదిలో నీళ్ళు ఉప్పొంగడంతో పట్టాల క్రింద ఉండే మట్టి, రాళ్ళు కొట్టుకుపోయాయి. ఆ కారణంగానే రెండు రైళ్ళు పట్టాలు తప్పాయని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంతవరకు 12 మంది మరణించినట్లు, 25మంది గాయపడినట్లు సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు తెలియజేసారు.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకొన్న రైల్వే ఉన్నతాధికారులు, సహాయ సిబంది అక్కడికి చేరుకొని సహాయ చర్యలు మొదలు పెట్టారు. హోరున కురుస్తున్న వానలో కటిక చీకటిలో క్రిందన చాల ఉదృతంగా ప్రవహిస్తున్న మాచక్ నదిపై ఉన్న వంతెన వద్దకు చేరుకొని సహాయ చర్యలు చేప్పట్టడం చాలా కష్టంగా ఉన్నప్పటికీ సహాయ సిబ్బంది, స్థానికులు కలిసి ప్రమాదంలో చిక్కుకొన్న సుమారు 300 మంది ప్రయాణికులను రక్షించగలిగారు. గాయపడిన వారినందరినీ స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు.
సమాచార లోపం కారణంగానే జనతా ఎక్స్ ప్రెస్ ని కూడా నదిపై ఉన్న వంతెన మీదకు అనుమతించినట్లు తెలుస్తోంది. కానీ స్థానిక రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చును. భారీ వర్షాల కారణంగా మాచక్ నది ఉదృతంగా ప్రవహిస్తున్న సంగతి స్థానిక రైల్వే సిబ్బందికి, అధికారులకి తెలియదని భావించలేము. వారు ఎప్పటికప్పుడు నదిపై ఉన్న వంతెనను గమనిస్తూ పరిస్థితిని అంచనా వేసిన తరువాతనే రైళ్ళను అనుమతించాల్సి ఉంటుంది. కానీ అదేమీ పట్టించుకోకుండా రైళ్ళను ఆ నదిపై ఉన్న వంతెనపైకి అనుమతించడం వలననే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చును.
స్థానిక రైల్వే సిబ్బంది అప్రమత్తంగా మెలిగి ఉంటే ఈ ఘోర ప్రమాదాలను నివారించగలిగేవారని స్పష్టం అవుతోంది. ఇప్పుడు ప్రమాదం జరిగిన తరువాత మేల్కొన్న స్థానిక రైల్వే అధికారులు పలు రైళ్ళను వేరే మార్గం ద్వారా పంపిస్తున్నారు. రైల్వే శాఖ ముందస్తు జాగ్రత్తగా ముంబై, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుండి బయలుదేరవలసిన అనేక రైళ్ళను రద్దు చేసింది. ఇదే నిర్ణయం ముందే తీసుకొని ఉండి ఉంటే ఇంత ఘోర ప్రమాదం జరిగి ఉండేదే కాదు. రైల్వే సహాయక బృందాలు నిన్న రాత్రినుండి నిర్విరామంగా సహాయ చర్యలలో పాల్గొంటున్నాయి.