వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్న గవర్నర్ ని కలిసి వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ “డజను మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. మరో నలుగురైదుగురు వెళ్ళిపోయినా పార్టీకేమీ నష్టం లేదు,” అని అన్నారు. ఆవిధంగా ఆయన మాట్లాడటం పార్టీలో నుంచి బయటకు వెళ్లిపోవాలనుకొంటున్న ఎమ్మెల్యేలని ప్రోత్సహిస్తున్నట్లుంది. అందుకే విశాఖ నుంచి ఒకరు, కర్నూలు నుంచి మరొక ఎమ్మెల్యే త్వరలో పార్టీ వీడేందుకు సిద్దం అయ్యారు. విశాఖ జిల్లాలో అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, కర్నూలు జిల్లాలో శ్రీశైలం ఎమ్మెల్యే బి. రాజశేఖర్ రెడ్డి పార్టీని వీడబోతున్నారని తాజా సమాచారం. వీరిలో సర్వేశ్వర రావు పార్టీ మారే విషయంపై సోమవారం ప్రకటన చేస్తానని తెలుపగా, రాజశేఖర్ రెడ్డి పార్టీ వీడబోతున్నట్లు ప్రకటించారు. యధా ప్రకారం విజయసాయి రెడ్డి తదితరులు వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు కానీ వారిరువురూ తెదేపాలో చేరడానికే నిశ్చయించుకొన్నట్లు సమాచారం. వారిరువురూ కూడా తెదేపాలో చేరితే ఇంతవరకు మొత్తం 15మంది వైకాపా ఎమ్మెల్యేలు పార్టీలో చేరినట్లవుతుంది. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే వైకాపాకి ఇది కోలుకోలేని దెబ్బ అవుతుంది.