ప్రకాశం జిల్లాలో గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి త్వరలో తెదేపాలో చేరబోతున్నట్లు నిన్న మీడియాలో వార్తలు వచ్చాయి. ఆయనతో బాటు అదే జిల్లాకు చెందిన మరొక ఎమ్మెల్యే కూడా తెదేపా సైకిల్ ఎక్కేందుకు సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం. ఆయన కందుకూరు వైకాపా ఎమ్మెల్యే పోతుల రామారావు. వారిద్దరూ నిన్న హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి హాజరు కాకుండా తమ తమ నియోజక వర్గాలలో తమ అనుచరులతో సమావేశమయ్యి పార్టీ మారడం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వారి సంగతి తెలుసుకొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ఫోన్ ద్వారా వారితో మాట్లాడేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరని తెలిసింది. అశోక్ రెడ్డి పార్టీ మారడం గురించి మీడియాలో నిన్న వార్తలు వచ్చినప్పటికీ ఆయన కానీ, వైకాపా నేతలు గానీ స్పందించకపోవడం గమనిస్తే వారు పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. అశోక్ రెడ్డి ఇవ్వాళ్ళ రాచర్ల మండలంలో తన అనుచరులతో చర్చించిన తరువాత పార్టీ మారడంపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.