నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వితీయ వార్షికోత్సవాలను భారీగా ప్రారంభించింది. మనుగడకు కీలకమైన ఉత్తర ప్రదేశ్‌లో నేను యూపీ వాలా నంటూ మోడీనే విషయం బయిటపెట్టారు. రెండున్నర దశాబ్దాల తర్వాత పూర్తి మెజార్టితో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గనక ,వ్యక్తిగతంగా మోడీకి ప్రజాదరణ బాగానే వుంది గనక అట్టహాసంగా చేసుకోవచ్చు. కాని అందుకోసం అనుసరిస్తున్న పద్ధతులు కొత్త కొత్తగా వాణిజ్య ఫక్కీలో వున్నాయి. బిగ్ బి అమితాబ్ బచన్, ముగ్గురు ఖాన్లు- అమిర్ సల్మాన్ షారుఖ్‌లు వేదికపై కనిపించనున్నారట. వికాస్ పర్వ్ పేరిట దేశమంతటా సంరంభం సాగిస్తారు. అద్యక్షుడు అమిత్ షా సప్త రాష్ట్ర పథకం(మిషన్ సెవెన్ స్టేట్స్)లో భాగమైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో అభ్యుదయ పథంలో భారత దేశంపేరిట 16 మంది కేంద్ర మంత్రుల బృందం పర్యటిస్తుంది. .మోడీ ప్రభుత్వ జయాపజయాలు, విధానాల మంచి చెడ్డలు అసహన రాజకీయాల నుంచి ఆర్థిక సవాళ్ల వరకూ అన్ని ఇప్పుడు ఎలాగూ చర్చకు వస్తాయి గనక వాటిపై మరోసారి చూడొచ్చు. .అయితే ఇవన్నీ వున్నా బిజెపి పార్టీ, ప్రభుత్వం కూడా భారీగానే ప్రచార సామగ్రి దిగుమతి చేస్తున్నాయి. మీడియా ఇన్చార్జిలతో జాతీయ వర్క్‌షాప్ నిర్వహించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఒక పుస్తకం విడుదల చేశారు. ఇదంతా కేవలం ద్వితీయ వార్షికోత్సవంగా గాక రాజకీయ వ్యూహాత్మక కదలికలుగా చూడాల్సివస్తున్నది. అస్సాం విజయం ఆధారంగా తాము జాతీయంగానే తిరిగి రాబోతున్నామన్న భావం కలిగించడం ఈ దశలో బిజెపికి చాలా అవసరమైన పని. ఎందుకంటే దానికి మూడంచెల ఎన్నికల సవాళ్లు దాని ఎదురుగా వున్నాయి.
వచ్చేఏడాది శాసనసబ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో బిజెపికి సంబంధించిన గుజరాత్,పంజాబ్(అకాలీలతో కలసి),గోవావున్నాయి. కాంగ్రెస్ పాలనలోని ఉత్తరాఖండ్,హిమచల్ ప్రదేశ్,మణిపూర్, సమాజ్‌వాదిపార్టీ పాలనలోని ఉత్తర ప్రదేశ్లలో ó ఎన్నికలు జరుగుతాయి. ఇందులో గుజరాత్ మోడీ స్వంత రాష్ట్రమే గాక బిజెపి నిరంతరంగా గెలుస్తున్న ఏకైక రాష్ట్రం. పంజాబ్‌లో ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా వుందని బిజెపి అద్యక్షులే అంగీకరించినా పొత్తు కొనసాగిస్తారు. అక్కడ కాంగ్రెస్ లేదా ఆప్‌లలో ఏది గెలుస్తుందోనని విశ్లేషణలు నడుస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పాలించే హిమచల్ ప్రదేశ్ సంప్రదాయికంగా బిజెపి పాలనలోనూ నడిచినరాష్ట్రం.గుజరాత్ నిలబెట్టుకోవడం ప్రాణాస్పదం. ఉత్తరాఖండ్‌లో ఇటీవలి రాజకీయ దుస్సాహసం బెడిసికొట్టింది. యుపిలో గనక గెలవకపోతే దేశంలోనూ బిజెపి పునరాగమన వాతావరణం మాయమవుతుంది. . ఇక 2018లో బిజెపి పాలనలోని రాజస్థాన్, మధ్య ప్రదేశ్,చత్తీస్ఘర్లలోనూ కాంగ్రెస్‌కు మిగిలిన పెద్ద రాష్ట్రం కర్ణాటకలోనూ, సిపిఎం వామపక్షాల పాలనలోని త్రిపురలోనూ నాగాలాండ్, మేఘాలయ,మిజోరాంలలోనూ ఎన్నికలు జరగాలి. యుపిలోని 79 లోక్‌సభ స్థానాలలోనూ 71 బిజెపి గెలిస్తే ఇప్పుడు ఆ బలం నిలిచే సూచనలు లేవు. స్థానిక ఎన్నికలలో బిజెపి బాగా దెబ్బతినింది. అదే శాసనసభ ఎన్నికల్లో పునరావృతమైతే 2018లో తమ పాలనలోని రాష్ట్రాలలోనూ ఉత్తరోత్తరా లోక్‌సభ ఎన్నికల్లోనూ కూడా ఆశలు వదులుకోవలసి వుంటుంది. ఇలాటి రాజకీయ సందర్బం గనకే కేంద్ర బిజెపి నాయకత్వం ద్వితీయ వార్షికోత్సవాలను రాజకీయ బలప్రదర్శనకు యుపిని రంగస్థలంగా చేసుకున్నారు.
2013తో మొదలు పెట్టి మోడీని ప్రధాని అభ్యర్థిగా ఆవిష్కరించడమే బాగా ముందస్తుగా జరిగింది. గుజరాత్లో మోడీ ప్రభుత్వ వ్యాపార అనుకూల పోకడలు కార్పొరేట్ ఇండియాకు బాగా నచ్చాయి. 2002 మత హత్యాకాండపై నిరసన వ్యక్తమైనా దాన్ని అధిగమించి ఘన విజయం సాధించిన మోడీ ఏకపక్ష ధోరణి ఇంకా బాగా నచ్చింది. అప్పటి ప్రధాని వాజ్‌పేయి మోడీని మార్చాలని గోవాలో జరిగిన జాతీయ కార్యవర్గంలో సూచించినా కార్పొరేట్ల ఆకాంక్ష మేరకు ఆరెస్సెస్ ఆయననే కొనసాగించింది.(అప్పుడే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వాజ్‌పేయి తరహాలో మాట్లాడటాన్ని మోడీ ఇప్పటికీ క్షమించలేదని చెబుతుంటారు) రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ గుజరాత్ అందించిన మరో మహాత్ముడు అంటూ మోడీని ఆకాశానికెత్తేశారు. ఎన్నికలకు బాగా ముందుగానే ఆయనను ే ప్రధాని అభ్యర్థిగా ప్రజల ముందుకు తెచ్చారు. 2013-14లో మోడీ ఎన్నికల ధగధగలు సోషల్ మీడియాలో సామూహిక యంత్రాంగం ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో చేసిన ప్రచారవ్యూహాలే. ఆ ప్రచారంలోనూ ప్రణాళికలోనూ చెప్పిన చాలా విషయాలు మోడీ సర్కారు అమలు చేసింది లేదు. కనుకనే మరోసారి ప్రచార ప్రభంజనం సాగిస్తే తప్ప ప్రజలను ఒప్పించడం సాధ్యం కాదు. ఈ కారణంగానే ఇంతవరకూ ఏ ప్రభుత్వం చేయని విధంగా రెండవ వార్షికోత్సవం పేరిట మధ్యంతర త్రీడీ ప్రచార ప్రహసనం తలపెట్టారు.
ప్రచారాలతో ప్రభావాలు ఎలా వుంటాయని చరిత్ర చూస్తే అప్పటి పరిస్థితిని బట్టి సఫలమైనవీ విఫలమైనవి కూడా వున్నాయి. దేశంలో తొలిసారి 1980లో ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారం కోసం ఒక అడ్వర్టయిజింగ్ ఏజన్సీని రంగంలోకి దించారు. ఎమర్జన్సీని ఓడించి ప్రజలు అధికారం అప్పగించిన జనతా ప్రభుత్వం రెండేళ్లలోనే కూలిపోవడంతో ప్రజలు నిరుత్సాహంలో మునిగివున్నారు. అప్పుడు ఇందిరాగాంధీ పనిచేసే ప్రభుత్వం(గవర్నమెంట్ దట్ వర్క్స్) అంటూ అడ్వర్టయిజింగ్ సంస్థ సహాయంతో ప్రచారం సాగించి రెండేళ్లలోనే తిరిగి వచ్చేశారు. 1984లో ఆమె హత్యకు గురికావడంతో రాజీవ్‌గాంధీకి సానుభూతి సరిపోయింది గాని అడ్వర్టయిజ్మెంట్లు కూడా బాగా వాడుకున్నారు. తర్వాత 1989లోనైతే ఒక బ్రిటిష్ ఆడ్ ఏజన్సీని తీసుకొచ్చి ప్రత్యేక కార్టునులతో బొమ్మలతో ప్రచారం సాగించారు. ప్రతిపక్షాలను తేళ్లు పాములతో పోల్చి వేసిన బొమ్మలు ప్రభుత్వానికే బెడిసికొట్టాయి. ఆయన ఓడిపోయారు. మళ్లీ 1996,98లలో లో బిజెపి వాజ్‌పేయి విగ్రహం ఆధారంగా ప్రచారం చేసుకుంది. ‘ ద మ్యాన్ ఇండియా అవైట్స్’ (భారత దేశం ఎదురుచూస్తున్న మనిషి) అన్న నినాదం ప్రచారంలో పెట్టారు. అది ఫలితాలిచ్చింది. వారే మళ్లీ 2004లో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్ ముద్రతో ‘వెలిగే భారతం'(ఇండియా షైనింగ్)నినాదాన్ని ట్యాగ్‌లైన్‌గా చేసుకుని దెబ్బతిన్నారు. తాను అడ్వర్టయిజింగ్ సంస్థల సమావేశంలో పాల్గొంటున్నప్పుడు ఈ ఫీల్‌గుడ్ అనే మాట తట్టిందని తర్వాత కాలంలో అద్వానీ చెప్పుకున్నారు. అప్పటికే సరళీకరణ విధానాలు పదేళ్లు పూర్తిచేసుకున్నాయి. రాజకీయాలు కూడా మార్కెటింగ్ సరుకులుగా మారిపోయాయి. కాంగ్రెస్‌కూడా ప్రచార వ్యాపార సంస్థలనే ఆశ్రయించడంతో 2004,2009 ఎన్నికలు కూడా కార్పొరేట్ తరహా ప్రచారాలతోనే సాగాయి.
మొత్తంపైన చూస్తే గతంలో వలె అధికారంలో వున్న పార్టీలపై వ్యతిరేకత(యాంటీ ఇంకంబెన్సీ) రావడం లేదని పాలకపక్షాలు భావిస్తున్నాయి. ఫలితాలను బట్టి పరిశీలకులు కూడా అంగీకరించాల్సి వస్తుంది. మౌన మోహన్ సింగ్‌గా పేరొందిన ప్రధాని రెండవ సారి గెలవగాలేనిది శక్తివంతుడై మౌనరేంద్రుడిగా మిగిలిన మోడీ మళ్లీ వచ్చేలా చేసుకోవచ్చని బిజెపి ఆశపడుతున్నది. జయలలిత,మమతా బెనర్జీ వంటి వారు మరోసారి విజయం సాధించడం ఇందుకు భరోసా అయింది.
నిజానికి కేంద్రంలోనూ రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు రెండేళ్లయ్యీ కాకముందే తదుపరి ఎన్నికల కోసం పరుగులు మొదలుపెడుతున్నాయి.మోస్ట్ హ్యాపెనింగ్, ఈవెంట్ , షో కోసింగ్, యూనిక్ సెల్లింగ్ పాయింట్స్, పర్సనల్ కెమిస్ట్రీ, క్యాచీ ట్యాగింగ్ వంటివి పాలక పక్షాల పాచికలుగా వున్నాయి. మోడీనే బిజెపి యుఎస్పి అని హిందూస్తాన్ టైమ్స్ రాయనే రాసింది. బ్రాండ్ మోడీ యుఎస్పికి మార్కెటింగ్ మాయాజాలమే వికాస పర్వం. ప్రజలు ఎలా స్పందిస్తారో రేపు తీర్పులెలా ఇస్తారో భవిస్యత్తు చెప్పాలి.