రాజకీయ వలసల పర్వంలో ఇవాళ అధికార తెలుగుదేశం పార్టీకి డబుల్ బొనాంజాగా కలిసి వస్తున్నది. ఇవాళ ఒకేరోజు ఇద్దరు ఎమ్మెల్యేలు వైకాపానుంచి తెదేపాలోకి వస్తున్నారు. వీరిలో ముహూర్త బలాన్ని ప్రధానంగా చూసుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి లాంఛనంగా చంద్రబాబుతో ఆయన నివాసంలో పసుపు కండువా కప్పించేసుకోవడం కూడా పూర్తయింది. అలాగే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ ఇద్దరూ కూడా ఇవాళ్లే తెదేపాలో చేరబోతున్నారు. ఎమ్మెల్యేల సంఖ్యనే ప్రధానంగా పరిగణిస్తే గనుక… ఒకేరోజు ఇద్దరు పార్టీలోకి వస్తున్నట్లు లెక్క!
కర్నూలు జిల్లాకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ప్రకటించినప్పటినుంచి ఆ జిల్లాలోని పలువురు నాయకుల చేరికపై ఊహాగానాలు ఉన్నాయి. వారిలో బుడ్డా రాజశేఖర్ కూడా ఉన్నారు. మరికొందరు ఎమ్మెల్యేల పేర్లు కూడా అడపాదడపా వినిపిస్తూనే ఉన్నాయి. వీరిలో బుడ్డా రాజశేఖర్ ముందుగా ఒక నిర్ణయానికి వచ్చేశారు.
గొట్టిపాటి చేరిక ఖరారైనరోజునే బుడ్డా చేరిక కూడా తేలిపోయింది. ఇద్దరూ గురువారం నాడే పార్టీలో చేరుతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే గొట్టిపాటి బుధవారమే చేరిపోయారు. గురువారం నాడు ఉదయం ముహూర్తం నిర్ణయించుకున్న బుడ్డా.. సరిగ్గా అదే సమయానికి చంద్రబాబు నివాసంలో ఆయనతో కండువా కప్పించుకుని చేరిక లాంఛనాన్ని పూర్తిచేశారు. కాకపోతే.. ఆయన చేరిక కోసం తాడేపల్లి లో పార్టీ ఓ సభను నిర్వహించనుంది. ఆ సభలో మళ్లీ అధికారికంగా ఆర్భాటంగా చేరడంతో పాటూ ఆయన అనుచరులు, మద్దతుదారులు కూడా పార్టీ తీర్థం పుచ్చుకోబుతున్నారు.
అలాగే.. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కూడా గురువారమే పార్టీలో చేరబోతున్నారు.