టాలీవుడ్ టైర్ 2, 3 హీరోలకి బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. అన్ని జాగ్రత్త తీసుకొని కొత్త కథలు, నేపధ్యాలు, విజువల్ ఫీల్ వుండే సినిమాలు చేస్తున్నప్పటికీ విజయాలు దక్కడం లేదు. వాళ్ళ ప్రయత్నాలు వర్క్ అవుట్ అవ్వడం లేదు.
వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ అంటూ ఒక ఏరియల్ యాక్షన్ సినిమా చేశారు. నిజానికి ఇలాంటి నేపధ్యంలో తెలుగులో సినిమా రాలేదు. సుధీర్ బాబు తన కెరీర్ లోనే పెద్ద యాక్షన్ సినిమాగా హరోం హర చేశారు. సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోన అంటూ ఓ ఫాంటసీని ప్రయత్నించారు. ఇవేవీ కూడా బాక్సాఫీసు వద్ద నిలబడలేకపోయాయి.
వీళ్ళే కాదు.. విజయ్ దేవరకొండ, అఖిల్, నాగశౌర్య, రాజ్ తరుణ్, కిరణ్ అబ్బవరం… ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోల సినిమాలు వర్క్ అవుట్ అవ్వడం లేదు. ఇలా వరుస అపజయాలతో హీరోల మార్కెట్ కి ఇబ్బంది కలగడం ఒకెత్తయితే, నిర్మాతలు కుదేలవ్వడం మరో రకమైన ఒత్తిడి పెంచుతోంది.
అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక చిత్రమైన పరిస్థితి వుంది. సినిమాలు ఎక్కువ తయారౌతున్నాయి. ఫ్లాప్ ఉన్నప్పటికీ నిర్మాత రెడీగా వుంటున్నారు. హీరో డేట్లు ఇస్తే చాల్లే అనే పరిస్థితి ఉంది. కొత్త నిర్మాతలు ప్రవాహంలా వచ్చి పడుతుండడంతో పెట్టుబడి పెట్టేవాళ్లకు కరవు ఉండడం లేదు. ఓటీటీ మార్కెట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది, ఎదోలా బయటపడిపోవచ్చన్నది నిర్మాతల నమ్మకం. దీంతో ఖాళీగా వుండాలా? బ్రేక్ తీసుకొని సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూడాలా? చేతికందిన సినిమా చేసుకుంటూ పోవాలా? అనేది హీరోల ముందున్న పెద్ద డైలామా. ఇందులో చాలా మంది హీరోలు ఖాళీగా వుండటం కంటే చేతికందిన సినిమా చేయడానిలే మొగ్గు చూపుతున్నారు. అయితే వరుస ఫ్లాపులు మాత్రం హీరోల మార్కెట్ ని త్రిశంకు స్వర్గంలో పడేశాయి. ఇలాంటి సమయంలో కూడా మెరుగైన స్క్రిప్టులు ఎంచుకొనేవాళ్లకే విజయాలు దక్కుతున్నాయి. అలాంటి కథల కోసం హీరోలు వేట మొదలెట్టారు. కొంతమంది స్టోరీ బ్యాంకుల్ని రెడీ చేసుకొంటున్నారు. అయితే ఇవన్నీ సరైన ఫలితాల్ని ఇస్తాయా, ఆయా హీరోల్ని మళ్లీ రేసులో నిలబెడతాయా అనేదే పెద్ద ప్రశ్న.