డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో నిబంధనను అమలులోకి తెచ్చింది. అమెరికా వీసాలు కావాలనుకునే వారు ఇకపై తమ సోషల్ మీడియా అకౌంట్లను, ఈమెయిల్స్‌ను, టెలిఫోన్ నెంబర్లను అమెరికన్ ఇమ్మిగ్రేషన్ విభాగానికి వెల్లడించాలి. వీసా జారీకి ముందు వీటిని కూడా అమెరికా పరిశీలిస్తుంది. అందులో ఏ రకమైన అభ్యంతరకరమైన సమాచారం ఉన్నప్పటికీ వీసా మంజూరు దుర్లభమే కాగలదు. మే 25నుంచి అందుతున్న దరఖాస్తులకు ఇది వర్తిస్తుంది. సాధారణంగా వీసాలు మంజూరవుతాయి.. కానీ అనివార్యమైన పరిస్థితుల్లో అదనపు ప్రశ్నలను జోడిస్తారు. ప్రపంచంలోని ఏ దేశస్థులకైనా ఇది వర్తిస్తుంది. అభ్యర్థి గుర్తింపు, నడవడిక దేశానికి ప్రమాదకరమని భావించిన సందర్భంలో మాత్రమే ఈ ప్రశ్నలను వేస్తారు.
వీసాల జారీలో జాతీయ భద్రతకే అత్యధిక ప్రాధాన్యమిస్తామని ఇమ్మిగ్రేషన్ తెలిపింది. దీని ప్రకారం ప్రతి అభ్యర్థినీ విస్తృతంగా పరిశీలిస్తారు. వీసాల జారీ పరిశీలన విధానాన్ని మెరుగుపరిచేందుకు అమెరికా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుందని ఇమ్మిగ్రేషన్ విభాగం తెలిపింది. కొత్త విధానంపై డోనాల్డ్ ట్రంప్ ఇటీవలే సంతకాలు చేశారు. మార్చి 6న ట్రంప్ జారీ చేసిన మెమో మేరకు చర్యలు చేపట్టింది. దీని మేరకు అదనపు సమాచార సేకరణకు శ్రీకారం చుట్టింది. ఏటా తమకు అందుతున్న 13 మిలియన్ల వీసా దరఖాస్తులలో ఒక్కశాతం కొత్త నిబంధనల వల్ల ప్రభావితం కావచ్చని భావిస్తున్నారు. వీసా జారీ అవసరం లేదని భావించిన సందర్భంలో మాత్రమే అదనపు సమాచారాన్ని క్రోడీకరిస్తామని అమెరికా అంటోంది. జాతి, మత, స్వజాతి, రాజకీయ అభిప్రాయాలు, లింగ వివక్ష వంటివి వీసాల జారీలో పట్టించుకోమి తెలియజేస్తోంది.
ఏమైనప్పటికీ.. తాజా నిబంధనలు ఫేస్బుక్, ట్విటర్, తదితర సామాజిక మాధ్యమాలను దుర్వినియోగించుకునే వారికి శరాఘాతమే.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి