కన్నడలో సూపర్ హిట్టయిన ‘యూ టర్న్’ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ఇలా పేరున్న నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఓ విధంగా సమంత చేస్తున్న తొలి లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇది. మాతృకను తెరకెక్కించిన పవన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పుడు ట్రైలర్ విడుదలైంది. ఓ థ్రిల్లర్లో ఎలాంటి అంశాలు ఆశిస్తామో.. అవన్నీ `యూటర్న్`లో పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఓ ఫ్లై ఓవర్పై వరుస ప్రమాదాలు జరుగుతుంటాయి. దానికి కారణం ఏమిటి? అనే ఆరా తీసే జర్నలిస్టుగా సమంత కనిపించబోతోంది. అయితే ఆ నేరాలన్నీ సమంతపైనే పడడం ఈ కథలో ట్విస్ట్. ఇలాంటి మలుపులు ఈ కథలో చాలా ఉన్నాయి. భూమిక ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఆమె పాత్రే ఈ కథని మలుపు తిప్పబోతోందేమో! కన్నడ `యూ టర్న్` ఉత్కంఠ భరితంగా సాగుతూనే ఓ ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఈ కాంబినేషన్ తెలుగులోనూ వర్కవుట్ అయితే… కచ్చితంగా అదే ఫలితం ఇక్కడా పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.