తన కోసం పిఠాపురం నియోజకవర్గాన్ని త్యాగం చేసిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు కాకినాడ ఎంపీ అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నట్లుగా జనసేన చీఫ్ వెల్లడించారు. పొత్తుల్లో ఎలాగైనా పిఠాపురం జనసేనకే వస్తుందని.. టీ టైమ్ వ్యవస్థాపకుడు ఉదయ్ శ్రీనివాస్ కు చాన్స్ వస్తుందని అనుకున్నారు. అయితే పవన్ అసెంబ్లీకే పోటీ చేయాలని అనుకున్నారు. బీజేపీ పెద్దలు పార్లమెంట్ కు పోటీ చేయాలని అడిగినా తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని చెప్పానన్నారు. ఈ క్రమంలో తన కోసం త్యాగం చేసిన ఉదయ్ శ్రీనివాస్ కు కాకినాడ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
పిఠాపురం నుంచి పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు చెందిన వారు కార్యాలయానికి వచ్చారు. వారిని ఉద్దేశించి మాట్లాడారు. పిఠాపురం తనకు ప్రత్యేక నియోజకవర్గం అని, ఈ ప్రాంతాన్ని తన స్వస్థలం చేసుకుంటానని పవన్ స్పష్టం చేశారు. 2019లో పిఠాపురం నుంచి పోటీ చేయాలంటే ఆలోచించాను. ఈ చోటును ఓ నియోజకవర్గంగా చూడలేదు. ఇక్కడ ఉండే కొన్ని గొడవలు, కులాల విషయాలు అన్ని చూశాను. కులాల ఐక్యత ఉంటూనే కాపు సమాజం పెద్దన్న పాత్ర పోషించాలి. ఈ రోజు తన కల సాకారం కానుందన్నారు. భీమవరం, గాజువాక, పిఠాపురం నియోజకవర్గాలు నాకు 3 కళ్లు. నా గెలుపు కోసం ఆలోచించకుండా, పార్టీ కోసం ప్రజల కోసం ఆలోచిస్తుంటే.. మిమ్మల్ని అసెంబ్లీకి పంపించే బాధ్యత మేం తీసుకుంటామని పిఠాపురం నేతలు, ప్రజలు చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
పిఠాపురం ప్రజలు తనను ఆశీర్వదించి విజయం చేకూర్చాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతకు గురై మత్స్యకార కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో తెలుసు, దీన్ని ఏపీకి మోడల్ నియోజకవర్గంగా చేద్దామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దామన్నారు. తాను అందర్నీ కలుపుకుని వెళ్లే వ్యక్తినని, ఒక్కసారి తనతో కలిసి వస్తే ఎప్పటికీ పార్టీని వీడరని చెప్పారు. మధ్య తరగతి మనుషులు ఎక్కువగా ఉన్న ప్రజలు తన నియోజకవర్గంలో ఉన్నట్లు చూశానన్నారు. సహజ వనరుల్ని ఎవరూ దోపిడీ చేయకుండా తన వంతు పోరాటం చేస్తానన్నారు.