తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది. కానీ నాయకుడు లేడు. బీజేపీకి పబ్లిసిటీ వస్తోంది కానీ ఓట్లు రావడం లేదు. డీఎంకే కూటమి బలంగా కనిపిస్తోంది. కానీ స్టాలిన్ తర్వాత ఎవరు అనే ప్రశ్న వస్తోంది. దీనికి కారణం స్టాలిన్ కు 70 ఏళ్లు దాటడం, తరచూ అనారోగ్యానికి గురవుతూండటమే.
అందుకే స్టాలిన్ తన వారసుడిగా పూర్తి స్థాయిలో ప్రజలకు సంకేతాలు ఇచ్చేందుకు ఉదయనిధిని తెరపైకి తీసుకు వస్తున్నారు. ఇప్పటికే మంత్రిగా ఉన్న ఆయనను డిప్యూటీ సీఎంను చేయబోతున్నారు. పార్టీని పూర్తిగా అనధికారికంగా ఆయనే నడుపుతున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా తన భుజాలపై మోశారు. పార్టీపై పట్టు సాధించే క్రమంలో ఆయన ముందంజలో ఉన్నారు. మాస్ ఇమేజ్ తెచ్చుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
నిజానికి కరుణానిధి కూడా తన వారసుడిగా స్టాలిన్ ను ప్రజల ముందుకు తేవాలనుకున్నప్పుడు.. డిప్యూటీ సీఎం పదవే ఇచ్చారు. కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు ఆయన వయసు కారణంగా చురుగ్గా ఉండలేకపోవడం వల్ల స్టాలిన్ ను డిప్యూటీ సీఎంగా నియమించారు. ఆయనే అన్నీ చూసుకున్నారు. ఇప్పుడు కూడా ఉదయనిధిని తన రాజకీయ వారసుడిగా ప్రజల ముందు ఉంచేందుకు డిప్యూటీ సీఎం పోస్టు ద్వారానే రాజకీయ వ్యూహం ఖరారు చేసుకున్నారు.