మహారాష్ట్రలో థాకరే కుటుంబం నుంచి తొలి ముఖ్యమంత్రి వస్తున్నారు. ఉద్దవ్ ధాకరేను ముఖ్యమంత్రిగా.. కాంగ్రెస్, ఎన్సీపీ అంగీకరించాయి. ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి చర్చల్లో ఈ మేరకు.. మూడు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ మూడింటిలో శివసేనకు అత్యధిక సీట్లు ఉన్నాయి. దీంతో.. ఆ పార్టీకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనుకున్నారు. అయితే.. ధాకరే కుటుంబం నుంచి.. బాల్ ధాకరే మనవడు.. 30 ఏళ్ల ఆదిత్య ధాకరే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం జరిగింది. ఆయన పేరునే… శివసైనికులు ఎన్నికల ముందు నుంచీ చెబుతూ వస్తున్నారు. ఆదిత్యధాకరే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు కూడా.
అయితే.. ఆయన ముఖ్యమంత్రి పదవికి మరీ చిన్నవాడవుతాడన్న ఉద్దేశంతో.. ఆయనకు కూటమి పార్టీలు మద్దతివ్వలేదు. ఉద్దవ్ ధాకరేను సీఎంగా ఉండాలని.. కాంగ్రెస్, ఎన్సీపీ ఒత్తిడి చేశాయి. శనివారం అధికారికంగా మూడు పార్టీలు కూటమి వ్యవహారాన్ని ప్రకటించి.. ఆ తర్వాత గవర్నర్ ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను తెలిపే అవకాశం ఉంది. మంత్రి పదవులు.. ఇతర అన్ని అంశాలపై ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్రలో దశాబ్దాలుగా.. ధాకరే కుటుంబం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. కానీ ఎప్పుడూ..వారు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. పదవులు చేపట్టలేదు.
చేపడితే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవే చేపట్టాలని.. బాల్ ధాకరే అనుకునేవారు. ఆయన కోరికను.. ఆయన కుమారుడు ఉద్దవ్ ధాకరే తీరుస్తున్నారు. బీజేపీతో కూటమి కట్టి… ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ.. ఓడిపోయిన కూటమి కాంగ్రెస్ – ఎన్సీపీతో కలిసి… శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. పంతాన్ని నెగ్గించుకుంటోంది. ఇది ఓ రకంగా బీజేపీకి షాక్ లాంటిదే. సిద్ధాంత రాజకీయాలకు రోజుల్లేవని చెప్పే మరో పరిణామమే.