ద్రవిడ మున్నేట్రకజగం పార్టీకి వారసుడ్ని స్టాలిన్ ఖరారు చేశారు. తన కుమారుడు ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా నియమించడం ద్వారా స్పష్టమైన సంకేతం ఇచ్చేశారు. గతంలో కరుణానిధి కూడా తన వారసుడిగా స్టాలిన్ ను నియమించాలనుకున్నప్పుడు డిప్యూటీ సీఎంను చేశారు. ప్రభుత్వాన్ని దాదాపుగా ఆయనే నడిపారు. ఇప్పుడు స్టాలిన్ యాక్టివ్ గా ఉన్నారు. ఉదయనిధిని పూర్తి స్థాయిలో మాస్ లీడర్ గా ప్రజల ముందు ఉంచేందుకు సమయం అవసరం అని ముందుగానే డిప్యూటీ సీఎంను చేసినట్లుగా భావిస్తున్నారు.
స్టాలిన్ మొదటి సారే సీఎం అయినా ఆయన వయసు 70 దాటిపోయింది. తమిళ రాజకీయాల్లో వ్యక్తి ప్రాధాన్యం ఉంటుంది. బలమైన నేత లేకపోతే పార్టీ బలహీనపడుతుంది. అన్నాడీఎంకే పరిస్థితి అదే. క్యాడర్ బలంగానే ఉన్నప్పటికీ… జయలలిత లాంటి లీడర్ లేకపోవడంతో ఆ పార్టీ కుంగిపోతోంది. డీఎంకేకు స్టాలిన్ లీడర్ గా ఉన్నారు. అయితే వారసుడ్ని ఖరారు చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన డిసైడయ్యారు. డీఎంకేకు తాను బలమైన నేతను కాగలనని.. ఉదయనిధి ఇప్పటికే నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
డీఎంకే భావజాలం వినిపించడంలోనూ.. పార్టీని ఏకతాటిపై నడిపించడంలోనూ ఉదయనిధి తనదైన శైలి చూపిస్తున్నారు. సినిమాల్లో ఆయన మాస్ ఇమేజ్ సంపాదించుకోలేదు కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మామన్నన్ వంటి సినిమాలతో అణగారిన వర్గాల యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అయితే… యువ నేతల్లో ముఖ్యుడిగా మారిపోతారు.