ముఖ్యమంత్రులు తమ వారసులు ఉంటే వారికి … మంత్రివర్గంలో చోటివ్వడం కామన్ అయిపోతోంది. గతంలో చంద్రబాబు లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చారు. తెలంగాణలో కేటీఆర్ ఇప్పటికే సీనియర్ మంత్రిగా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఓ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ఇప్పుడు తమిళనాడులోనూ సీఎం స్టాలిన్ తన కుమారుడ్ని మంత్రిని చేశారు. సినీ నిర్మాతగా.. హీరోగా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచితులైన ఉదయనిధి స్టాలిన్ కుమారుడు. ఆయన ఇవాళ తమిళనాడు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
యూత్ , స్పోర్ట్స్ మినిస్టర్‌గా ఉదయనిధికి స్టాలిన్ బాధ్యతలు అప్పగించారు. సహజంగానే ఈ అంశంపై తమిళనాడులో రాజకీయ దుమారం రేగుతోంది. వారసత్వ రాజకీయాలు అని ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. డీఎంకే నేతలు…మాత్రం స్వాగతిస్తున్నారు. ఉదయనిధి కి వారసత్వం ప్రకారం కాకుండా.. ప్రతిభ ఆధారంగానే చాన్స్ వచ్చిందని చెబుతున్నారు.
ఉదయనిధి స్టాలిన్ గతంలో కరుణానిధి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనతికాలంలోనే మంత్రి అయ్యారు. డీఎంకే తదుపరి నాయకత్వాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలన్న లక్ష్యంతో స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. గతంలో స్టాలిన్ కూడా .. తన తండ్రి కరుణానిధి మంత్రివర్గంలో పని చేశారు. అప్పట్లో డిప్యూటీ సీఎంగా చేశారు. ఇప్పుడు కుమారుడుకి మంత్రి పదవి ఇచ్చారు.