ఉడ్ తా పంజాబ్ సినిమా వివాదం నిజంగానే సినీ ఫక్కీలో మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకూ సెన్సార్ బోర్డుతో సినీ కష్టాలు ఎదురయ్యాయనే తెలుసు. 89 కట్స్ ప్రతిపాదించడంతో పాటు పంజాబ్ అనే పదాన్ని వాడొద్దని సెన్సార్ బోర్డు షరతులు విధించింది. దీంతో ఆ సినిమా నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా వివాదం బుధవారం నాడు అనూహ్య మలుపు తిరిగింది. పంజాబ్ ను, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ డబ్బులు ఇచ్చి ఈ సినిమా తీయించిందని తాను విన్నట్టు సెన్సార్ బోర్డు చైర్మన్ పెహ్లాజ్ నిహ్లానీ చెప్పారు. సినిమా నిర్మాతల్లో ఒకరైన అనురాగ్ కశ్యప్ ఆప్ నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు.
దీనిపై బాలీవుడ్ లో దుమారం రేగింది. పలువురు సినీ ప్రముఖులు ఏకతాటిపైకి వచ్చి మీడియాతో మాట్లాడారు. నిహ్లానీపై మండిపడ్డారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణ హాస్యస్పదమని కశ్యప్ వ్యాఖ్యానించారు. చివరకు నిహ్లానీని ఆ పదవి నుంచి తొలగించాలని చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు డిమాండ్ చేశారు.
ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. నిహ్లానీ ఆరోపణ నిజమో కాదో గానీ, పంజాబ్ లో పాగా వేయడానికి ఆప్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో తనకే నమ్మశక్యం కాని విధంగా పంజాబ్ లో ఆప్ 4 సీట్లు గెల్చుకుంది. అప్పటి నుంచి పంజాబ్ లో ప్రభుత్వ ఏర్పాటు చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరచూ పంజాబ్ లో పర్యటిస్తున్నారు.
వచ్చే నెలలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పదేళ్లుగా బాదల్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందనేది ఆప్ నమ్మకం. అకాలీదళ్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వ పనితీరు సరిగా లేదు కాబట్టి తాను విజయం సాధించడం అసాధ్యం కాదని ఆప్ భావిస్తోంది. అందుకే చకచకా పావులు కదుపుతోంది. ఇద్దరు ఆప్ ఎంపీలు పార్టీపై గుర్రుగా ఉన్నా, ఆందోళనలు, సమస్యలపై ధర్నాలతో కేడర్ ను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు జరగుతున్నాయి. ఆప్ వ్యూహంలో భాగంగానే ఈ సినిమాను తీయించారనేది తాజా ఆరోపణ.
ఆరోపణలు, వివాదాలు ఎలా ఉన్నా పంజాబ్ లో డ్రగ్స్ సంస్కృతి శ్రుతి మించిందనేది వాస్తవం. స్థానికంగానే కాదు, పాకిస్తాన్ నుంచి కూడా రోజూ భారీగా మాదక ద్రవ్యాలు పంజాబ్ లోకి రవాణా అవుతున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్నే ఎక్కువగా నిందించాలనే విమర్శలున్నాయి. డ్రగ్స్ దందాపై పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుంటారనే విమర్శలున్నాయి. దీనికి కారణం ప్రభుత్వ స్థాయిలో వచ్చే ఒత్తిళ్లనేది ప్రధానమైన ఆరోపణ. అందుకే, ఉడ్ తా పంజాబ్ విడుదలైతే అకాలీ దళ్ ప్రభుత్వానికి నెగెటివ్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే సెన్సార్ బోర్డు ద్వారా ఇలా చక్రం తిప్పారన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ వివాదం హైకోర్టుకు చేరింది.