ugadi 2025 rasi phalalu vishwaavasu
శ్రీ క్రోధి నామ సంవత్సరం ముగిసింది..శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాది గ్రహసంచారంలో చాలా మార్పులున్నాయి. కుంభరాశిలో ఉన్న శని మీనంలోకి అడుగుపెడుతున్నాడు. గురు సంచారం మారుతోంది. ఈ ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుంది. ఎవరికి అనుకూల ఫలితాలు, ఎవరికి ప్రతికూల ఫలితాలు, ఎవరికి మిశ్రమ ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి.
మేష రాశి ( అశ్వని, భరణి, కృత్తిక మొదటి పాదం )
(ఆదాయం: 2 , వ్యయం:14 ) , (రాజపూజ్యం:5 , అవమానం:7 )
శ్రీ విశ్వావసు నామ సంవత్సంరలో మేష రాశి వారికి గడ్డుకాలంలా ఉంటుంది. ఈ ఏడాది వీళ్ళకి ఏప్రిల్ 18 నుంచి ఏలినాటి శని ప్రారంభం వల్ల ఉత్సాహంగా అన్ని పనులు ప్రారంభించేస్తారు. కానీ ఏ పనులూ పూర్తిచేయలేరు. చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. ఆరంభంలో ఉన్నంత ఉత్సాహం సంవత్సరాంతానికి ఉండవు. కొత్త వ్యాపారాలు, వ్యవహారాలు ప్రారంభించకుండా ఉండడమే మంచిది. మేషరాశి ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి.
వృషభ రాశి ( కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర మొదటి 2 పాదాలు)
(ఆదాయం : 11 వ్యయం : 5 ) (రాజ్యపూజ్యం : 1 అవమానం : 3 )
ఈ కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. గురుడు మీ రాశి నుంచి మిథునంలోకి అడుగుపెడుతున్నాడు. రెండో స్థానం అయిన ధన స్థానంలో గురుడు మారటం వల్ల విశిష్ట ఆలోచనలు వస్తాయి. ఆశించిన పనుల్లో అడుగు ముందుకుపడుతుంది. విజయాలు సంపదలు కలుగుతాయి. ఈ ఏడాది అన్ని రంగాలవారు ఉన్నతమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు శుభసమయం. నిరుద్యోగులు మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఈ ఏడాది మీకు ప్రశాంతమైన కాలం. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు.
మిథున రాశి (మృగశిర 3, 4 , ఆరుద్ర, పునర్వసు మొదటి 3 పాదాలు )
(ఆదాయం : 14 వ్యయం : 2 ) (రాజ్యపూజ్యం : 4 అవమానం : 3 )
మిథున రాశివారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో విశేషమైన ఫలితాలుంటాయి. నూతన వాహన ప్రాప్తి. గృహంలో మార్పులుంటాయి. గతేడాది కన్నా ఈ ఏడాది ప్రశాంతత ఉంటుంది. గురుడు 12వ స్థానం నుంచి జన్మస్థానానికి చేరుకోవడంతో మానసిక వైకల్యం నుంచి బయట పడి ఉపశమనం పొందుతారు. అన్ని రంగాల వారు విశేషమైన ఫలితాలు పొందుతారు. జన్మంలో గురు సంచారం వల్ల వినూత్న ఆలోచనలు వస్తాయి. ఉద్యోగం, వ్యాపారంలో ఉన్నత స్థితి పొందుతారు. గురు బలంతో పాటూ రాజ్యంలో ఉన్న శని కూడా ఉత్తమ ఫలితాలు అందిస్తాడు. ఈ రాశి రాజకీయ నాయకులు మంచి పదవులు పొందుతారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఈ ఏడాది ఈ రాశివారు తీర్థయాత్రలు చేస్తారు.
కర్కాటక రాశి ( పునర్వసు చివరి పాదం, పుష్యమి, ఆశ్లేష )
(ఆదాయం : 8 వ్యయం : 2 ) (రాజ్యపూజ్యం : 7 అవమానం : 3 )
కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం శుభకాలం. గడిచిన రెండేళ్లుగా ఉన్న కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. అష్టమ శని నుంచి విముక్తి లభిస్తుంది. రాహు కేతువులు సంచారం శుభ ఫలితాలని ఇస్తుంది. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురుడు 12వ స్థానంలో సంచారం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు. కుటుంబంలో సమస్యలు ఏర్పడుతాయి. గురుబలానికి సంబంధించిన పూజలు చేయడం అత్యంత శ్రేయస్కరం. కర్కాటక రాశి వారికి ఈ ఏడాది కొత్త వ్యాపారాలు, నూతన వ్యవహారాలు అంత ఆమోదయోగ్యం కాదు. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. రాజకీయ నాయకులు, వ్యాపారులు కూడా మిశ్రమ ఫలితాలు పొందుతారు. మానసిక సమస్యల మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.
సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర మొదటి పాదం )
(ఆదాయం : 11 వ్యయం : 11 ) (రాజ్యపూజ్యం:3 అవమానం : 6 )
సింహ రాశి వాళ్ళకి ఈ ఏడాది గురుబలం ఉంటుంది. అయినప్పటికీ మే నుంచి అష్టమ శని ప్రభావం వల్ల వాహన ప్రమాద సూచనలున్నాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం మంచిదికాదు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. నూతన గృహ నిర్మాణాలు చేపడతారు. రాజకీయాల్లో శుభఫలితాలు పొందుతారు. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. కానీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం సింహ రాశి వాళ్ళకి అష్టమ శని కూడా ప్రారంభం వల్ల అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. వ్యాపారాలు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నతి స్థానం సాధిస్తారు
కన్యా రాశి (ఉత్తర 2, 3, 4 . హస్త, చిత్త తొలి రెండు పాదాలు)
(ఆదాయం : 14 వ్యయం : 2 ) (రాజ్యపూజ్యం : 6 అవమానం : 6 )
కన్యా రాశి వారికి విశ్వాసమనామ సంవత్సరం అద్భుతమైన ఫలితాలను అందిస్తోంది. గురుడు రాజ్య స్థానంలో అడుగు పెట్టడం వల్ల అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు చేతికందుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఉన్నత ఫలితాలను పొందుతారు. శని ఏడో స్థానంలో సంచారం వల్ల జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వస్తాయి. శ్వాసకోశకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశముంది. ఓవరాల్ గా ఈ ఏడాది కన్యారాశివారికి ఉన్నతమైన ఫలితాలున్నాయి.
తులా రాశి ( చిత్త 3, 4 , స్వాతి, విశాఖ తొలి 3 పాదాలు )
(ఆదాయం : 11 వ్యయం : 5 ) (రాజ్యపూజ్యం:2 అవమానం : 2 )
తులారాశి వారికి ఈ ఏడాది శుభ ఫలితాలుంటాయి. ఈ సంవత్సరం గురుడు అష్టమం నుంచి భాగ్య స్థానంలోకి రావటం వల్ల ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన డబ్బులు చేరుతాయి. రుణ విముక్తి లభిస్తుంది. ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే వాటి నుంచి ఉపశమనం పొందుతారు. శని ఆరో స్థానంలోకి వెళ్ళటం వల్ల శుభ ఫలితాలంటాయి. గురు బలం కూడా బాగుంటుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. నూతన వాహన ప్రాప్తి. విద్యార్థులు ఉన్నత ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులకు అధిష్టానం అనుగ్రహం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ ఏడాది అత్యద్భుతమైన కాలం
వృశ్చిక రాశి ( విశాఖ నాలుగో పాదం, అనూరాధ, జ్యేష్ట )
(ఆదాయం : 2 వ్యయం : 14 ) (రాజ్యపూజ్యం : 5 అవమానం : 2 )
వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అష్టమ శని నుంచి విముక్తి పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం బావుంటుంది. రాహు, కేతువుల సంచారం బాగానే ఉంది. అష్టమంలో శని సంచారం నుంచి విముక్తి లభించి ఆ స్థానంలోకి గురుడు వచ్చి చేరాడు. ఫలితంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. జీవిత భాగస్వామితో, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు నిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పటించడం మంచిది. గురుపూజలు చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఎంత తాకువ మాట్లాడితే అంత మంచిది.
ధనస్సు రాశి ( మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ తొలి పాదం )
(ఆదాయం : 5 వ్యయం : 5 ) (రాజ్యపూజ్యం : 1 అవమానం : 5 )
ధనస్సు రాశి వారికి ఈ ఏడాది శుభ ఫలితాలున్నాయి. గురుడు శత్రు స్థానం నుంచి కేంద్రంలోకి రావడం వల్ల అంతా శుభమే జరుగుతుంది. శని మూడో స్థానం నుంచి నాలుగు స్థానంకి మారుతున్నాడు. అర్ధాష్టమ శని వల్ల చికాకులు తప్పవు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. విద్యా వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి అడుగు ముందుకేయాలి. ఆర్థిక రంగంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం ఉత్తమం. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ ఏడాది ప్రశాంతంగా గడిచిపోతుంది.
మకర రాశి ( ఉత్తరాషాడ 2,3,4, శ్రవణం, ధనిష్ట తొలి 2 పాదాలు)
(ఆదాయం : 8 వ్యయం : 14 ) (రాజ్యపూజ్యం : 4 అవమానం : 5 )
మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏలినాటి శని నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. అప్పుల బాధల నుంచి బయటపడిపోతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కలిసొస్తాయి. నూతన వాహన ప్రాప్తి. స్థిరాస్తులు కొనుగోలుచేస్తారు. నూతన గృహ సూచన ఉంది. కోర్టుకేసులలో చిక్కుకున్నవారు ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులకు అనుకూలమైన కాలం. వ్యాపారంలో లాభాలుంటాయి. మొత్తంగా మకర రాశివారికి ఈ ఏడాది అద్భుతమైన ఫలితాలుంటాయి.
కుంభ రాశి ( ధనిష్ట 3, 4 , శతభిషం, పూర్వాబాద్ర తొలి 3 పాదాలు)
(ఆదాయం : 8 వ్యయం : 14 ) (రాజ్యపూజ్యం : 7 అవమానం :5 )
కుంభ రాశి వారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ కొంత ఉపశమనం లభిస్తుంది. మీనం లో శని సంచారం వల్ల ఆర్థికంగా ఇబ్బందులుంటాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. వ్యాపారం సాధారణంగా సాగుతుంది. నూతన పెట్టుబడులు పెద్దగా కలసిరావు. విద్యార్థులు పూర్తిస్థాయిలో చదువుపై శ్రద్ధ వహిస్తేనే మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలుంటాయి. సమస్యలు ఉన్నప్పటికీ గురుబలం ఉండడంతో సమస్యలను అధిగమిస్తారు. అడ్డంకులు ఎదుర్కొని అడుగుముందుకు వేస్తారు.
మీన రాశి ( పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి )
(ఆదాయం : 5 వ్యయం : 5 ) (రాజ్యపూజ్యం : 3 అవమానం : 1 )
మీన రాశి వారికి ఈ సంవత్సరం శని జన్మంలో అడుగుపెడతాడు. ఫలితంగా అన్ని రంగాల వారు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ ఏడాది రాహుకేతు సంచారం కూడా సరిగా లేదు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఏలినాటి శని ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. సంఘం లో గౌరవం తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి . వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చినట్టే వచ్చి ఆగిపోతాయ్. వ్యాపారంలో నూతన పెట్టుబడులకి అనుకూలం కాదు. ఓవరాల్ గా శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి వారికి జీవితం పరీక్షా కాలమా అన్నట్టుంటుంది.
-సరస్వతి రాళ్లపల్లి
గమనిక: పండితుల సూచనలు, పంచాంగం ఆధారంగా రాసిన ఫలితాలు ఇవి. ఓ రాశిలో ఫలితాలు ఒకరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో గ్రహ సంచారం ఆధారంగా ఫలితాల్లో మార్పులుంటాయి