తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది నేడు. ఈ ఏడాది పేరు శ్రీక్రోధి నామ సంవత్సరం. కాస్త కటువుగా ఉన్న ప్పటికీ.. జీవితంలో అన్ని రుచులకు అవకాశం ఉన్నట్లే… కోపానికి కూడా చోటు ఉంటుంది. కోపం లేని మనిషి ఉండడు. ఆ కోపం లేకపోతే మనిషి పక్క వారికి అలుసైపోతాడు. ప్రతీ మనిషి కోపం చూపించాలి… అయితే అది అన్యాయంపై, అక్రమంపై… జీవితాల్ని బుగ్గి చేస్తున్న వారిపై ఆ కోపం చూపించాలి. ఈ ఏడాది ప్రజలు కోపం చూపించాల్సిన సమయంలోనే క్రోధినామ సంవత్సరం రావడం దైవసంకల్పం అనుకోవచ్చు.
ఈ ఏడాది దేశంలో రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి. దేశంలో పదేళ్లుగా ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో ఐదేళ్లుగా ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాల వల్ల బాగుపడ్డామని.. సంతోషంగా ఉన్నామని… కుటుంబాలు బాగుపడ్డాయని.. తమ ఊరు లేదా మండలం లేదా నియోజకవర్గం లేదా రాష్ట్రం లేదా దేశం బాగుపడ్డాయని అనుకుంటే కోపం ఉండక్కర్లేదు. ఏమీ జరగలేదు.. పన్నుల రూపంలో దోపిడీ చేసి కనీసం ప్రయాణించడానికి రోడ్లు కూడా లేకుండా చేశారంటే… ఖచ్చితంగా కోపం చూపించాల్సిందే. అది ఓటు ద్వారా .
దేశంలో అందరికీ మంచి చేసే ప్రభుత్వం ఉండదు.. అందరికీ చెడు చేసే ప్రభుత్వం ఉండదు. కానీ మధ్యతరగతిని కొట్టి ఓటు బ్యాంకుకు పంచే ప్రభుత్వం మాత్రం ఉండకూడదు. ఒకరి పొట్టకొట్టి మరొకరి పొట్ట నింపాలనే దుష్టమైన ఆలోచన ఉన్న పాలకులపై ఖచ్చితంగా కోపం చూపించాల్సిందే. దురదృష్టవశాత్తూ మన దేశంలో మధ్యతరగతి జీవులే రాజకీయ పార్టీలకు ఆదాయవనరులు. వారిని దోచుకుని ఓటు బ్యాంకుకు పంచుతున్నాయి. ఇలాంటి పార్టీలపై కోపం పెంచుకుని ఓటుతో బుద్ది చెప్పే అవకాశం క్రోధినామ సంవత్సరం కల్పిస్తోంది.
ఏడాది ప్రారంభంలో ఏం చేశారో .. ఏడాది అంతా అలాగే ఉంటుందని ఓ నమ్మకం. అందుకే ఈ రోజు చేతనైన పద్దతిలో గాడి తప్పిన పాలనపై..దారి తప్పిన వ్యవస్థలపై ధర్మాగ్రహం వ్యక్తం చేయండి. రేపు అదే.. మనకు కోపాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం లేకుండా చేయవచ్చు.
అందరికీ ఉగాది శుభాకాంక్షలు.,