శ్రీ విశ్వావసు ఉగాది. విశ్వం నివాసంగా కలిగినవాడు విశ్వావసు. అంటే భగవంతుడు. ఈ ఏడాది భగవంతుడి పేరు ఉంది కాబట్టి అందరికీ సంతోషాన్ని కలిగించి , పరస్పర ప్రేమానురాగాలను పెంపొందిస్తుందని పండితులు చెప్పారు. తెలుగువారు కొత్త ఏడాదిని ఉగాది నుంచే ప్రారంభిస్తారు. అందుకే తమ పనులను శుభంగా ప్రారభించుకుంటారు.
ఉగాదికి పంచాంగాలు చెబుతారు. పంచాంగాలు కూడా పండితులు తాము ఎవరికి చెబుతున్నారో వారికి అనుకూలంగా చెబుతారు. నిజానికి అందరూ చెప్పేది కరెక్టే. కానీ దాన్ని తీసుకునే విధానంలోనే ఉంటుంది. ఏ పండుగ అయినా సంతోషం, ప్రేమానురాగాలను తీసుకు వస్తుంది. అయితే అది తీసుకున్నామా లేదా అన్నది మన మనస్థత్వాన్ని బట్టే ఉంటుంది. సంతోషం, ప్రేమానురాగాలను ఎవరూ నిర్వచించలేరు. సంతోషం ఎలా వస్తుందో తెలుసుకున్నప్పుడు మాత్రమే దానికి నిర్వచనం తెలుస్తుంది. అత్యధిక మంది డబ్బుతో సంతోషం వచ్చేస్తుందని అది రావడమే సంతోషం అనుకుంటారు. కానీ డబ్బుతో వచ్చేది సంతోషం కాదని తెలిసే సరికి సంతోషం గురించి ఆలోచించాల్సినంత అవసరం లేనంత టెన్షన్లలో పడిపోతారు. డబ్బు మాయలో పడి ప్రేమానురాగాల్ని మర్చిపోతూంటారు. ఉగాదికి ఇల్లంతా అలంకరించి గొప్పగా ఖర్చు పెట్టి పూజలు చేస్తే వచ్చేది దైవకృప, సంతోషం, ప్రేమానురాగాలు కాదు.. కేవలం డాబు చూపించుకోవడమే. ఎంత సింపుల్ గా చేసుకున్నా కుటుంబం మధ్య ప్రేమానురాగాలే అసలు పండుగ.
ఉగాది పచ్చడి ఎలా ఉంటుందో జీవితం కూడా అలాగే ఉంటుంది. అంతా సంతోషమే ఉండదు. ఉన్నా వెగటు పుట్టేస్తుంది. ఏదైనా ఓ విజయం ఆషామాషీగా వస్తే దానికి విలువ ఉండదు. కానీ కష్టపడి సాధిస్తే కలిగే సంతోషం అమూల్యం. అదే అసలైన ఉగాది లాంటిది. తీపి, పులుపు, వగరు అన్నింటినీ జీవితంలో సమంగా ఆహ్వానించి.. వాటిని ఆస్వాదించినప్పుడే.. జీవితాన్ని పూర్తి స్థాయిలో సంతోషంగా, ప్రేమానురాగాలతో నడుపుతున్నట్లుగా. ఇతరుల పట్ల ద్వేషాన్ని వీలైనంత వరకూ నియంత్రించుకుంటే సంతోషం రెట్టింపు అవుతుంది. మన జీవిత గమనంతో సంబంధం లేని అంశాలను వాటికి ఉన్న ప్రాధాన్యత వరకే ఉంచాలి.
సినిమాల్లో ఉపాధి పొందుతూ ఉంటే దాని కోసం సమయం కేటాయించవచ్చు కానీ.. అవసరం లేకపోయినా సమయం వెచ్చించడం జీవితాన్ని వృధా చేయడమే. ఇదే రాజకీయం, స్టాక్ మార్కెట్ అన్ని రంగాలకు వర్తిస్తుంది. సమయపాలన కరెక్ట్ గా చేసుకుని ప్రాథాన్యత అంశాలపై సమయం వెచ్చిస్తే ఈ భగవంతుని సంవత్సరం శ్రీవిశ్వావసులో శుభాలు వంద శాతం కలుగుతాయి.
అందరికీ శ్రీవిశ్వావసు ఉగాది శుభాకాకంక్షలు !