కరోనా వైరస్‌కు ధనిక , పేద తేడా లేదు. ఉన్నత విద్యావంతుడా… చదువులేని వ్యక్తా అన్న తేడా లేదు. కులం, మతం.. ప్రాంతం… హోదా.. అధికారం అనే బేధం కూడా తెలియదు. ప్రస్తుతం యూరప్‌లోని పలు దేశాల అధ్యక్షులకు ఈ పరిస్థితి ఎదురవుతోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా సోకింది. దాంతో ఆయన ఐసోలేషన్‌కు వెళ్లిపోయారు. ఇప్పటికే బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ కు కూడా కరోనా సోకింది., దాంతో ఆయన కూడా ట్రీట్మెంట్కి వెళ్లిపోయారు. వీరితో కాంటాక్ట్‌లో ఉన్న వారంతా క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. ఇప్పటికే జర్మనీ చాన్సలర్ ఎంజెలా మొర్కెల్ కూడా..కరోనా పాజిటివ్‌తో ఐసోలేషన్‌లో ఉన్నారు.
ఆర్థికంగా.. ఆరోగ్య పరంగా ఎంతో ఎదిగిన దేశాలు.. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా గడగడ వణికిపోతున్నాయి. అమెరికా అంటే అగ్రరాజ్యం. అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన దేశం. దేశంలో పది శాతం మంది వెంటిలేటర్లపై ఉండాల్సిన పరిస్థితి వచ్చినా తట్టుకోగలగిన దేశం. కానీ.. ఇప్పుడు ఆ స్టేజ్ కూడా.. దాటిపోతోంది. ఇటలీలో చనిపోతున్నవారికి క్రిమేషన్ చేసే పరిస్థితి కూడా లేదు. ఇంత దారుణంగా కరోనా వారిపై విరుచుకుపడుతోంది. వారి వద్ద ఉన్న ధనం.. పదవులు.. వారిని కరోనా నుంచి బయటపడేలా చేయడం లేదు.
మన దేశంలో మాత్రం.. కొంత మంది.. చోటా రాజకీయ నేతలు కూడా… నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అధికార పార్టీ నేతలమని.. పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. బడా పారిశ్రామికవేత్తలు.. సులువుగా తిరుగుతున్నారు. అధికార పెద్దల వద్దకు వెళ్లిపోతున్నారు. క్వారంటైన్లు.. లాక్డౌన్లు పట్టించుకోవడంలేదు. ఎమ్మెల్యేలు.. ఇతర ప్రజాప్రతినిధులు కూడా.. అంతే. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే రోడ్లపైకి వచ్చేస్తున్నారు. వీరందరికీ.. యూరప్‌లో దేశాధ్యక్షులకు సైతం.. సోకుతున్న కరోనా హెచ్చరికలు పంపుతోంది. ఇకనైనా జాగ్రత్త పడుతారో లేదో మరి..!