2020 వెళ్తూ వెళ్తూ ఫినిషింగ్ టచ్ ఇచ్చి వెళ్తోంది. 2021లోనూ ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు. బ్రిటన్‌లో కరోనాను మించిన ఓ కొత్త వైరస్ చెలరేగిపోతోంది. దాంతో ఆ దేశంలో లాక్ డౌన్ విధించారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ బ్రిటన్ నుంచి విమానాల రాకపోకల్ని నిలిపివేస్తున్నాయి. ఇండియా కూడా నిలిపివేసింది. ఎవరైనా బ్రిటన్ నుంచి వస్తే.. వారికి ఆర్టీ పీసీఆర్ టెస్టు కంపల్సరీ చేసింది. కరోనా వైరస్ కారణంగా మొదట్లో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి భయ పరిస్థితులు ఉండేవో.. అలాంటి పరిస్థితులు ఇప్పుడు మళ్లీ ఏర్పడుతున్నాయి.
బ్రిటన్ లో వైరస్ కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కన్నా ఎక్కువగా స్ట్రెయిన్ 70 శాతం ఎక్కువగా ఇతరులకు సోకే అవకాశం ఉంది. దీనిని బ్రిటన్ లో ఓ పేషెంట్ లో సెప్టెంబర్ లో కనుగొన్నారు. బ్రిటన్ లో వైరస్ వ్యాపిస్తుండటంతో ఆ దేశంతో యూరప్ దేశాలు ఫ్లైట్ సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు యూకేతో విమాన సర్వీసులపై ఆస్ట్రియా , బెల్జియం, ఇటలీ, నెదర్లాండ్స్, జర్మనీ దేశాలు ఆంక్షలు విధించాయి. ఇండియాలో మంగళవారం రేపు రాత్రి నుంచి ఈ నెలాఖరు వరకు విమానాలను ఆపేస్తున్నారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని … కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రకటించారు.
ఈ కొత్త వైరస్ కూడా కరోనా లాంటిదేనని.. శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రస్తుతం కరోనాకు వేస్తున్న వ్యాక్సిన్ స్ట్రెయిన్ కు పని చేస్తుందో లేదో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ కొత్త వైరస్ కేసులు వేరే దేశాల్లోనూ బయటపడితే.. మళ్లీ.. లాక్ డౌన్ సీజన్ ప్రారంభమైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పటికీ కరోనా టెన్షన్ ప్రపంచాన్ని వదిలి పెట్టలేదు. పీక్స్‌లోనే ఉంది. ఆ భయంతో.. ఇప్పుడు ప్రపంచంలో దేశాల మధ్య రాకపోకలు మరోసారి బంద్అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.