ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ఏం చేయదలచుకున్నాడో.. అనాథలా ఏర్పడిన ఈ రాష్ట్రం సొంత కాళ్ల మీద నిలదొక్కుకోవడానికి ఆయన ఎలాంటి సాయం అందించదలచుకున్నాడో.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవడంలో ఎంత చిత్తశుద్ధితో వ్యవహరించదలచుకున్నాడో ఈ రెండేళ్ల కాలంలో తేలిపోయింది. కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుందన్నట్లుగానే.. మోడీ వంచనాశిల్పం ప్రజలకు అర్థమవుతూనే ఉంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ వ్యయం పూర్తి బాధ్యతను కేంద్రమే తీసుకోవాలంటే కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి ప్రధాని మోడీకి లేఖాస్త్రం సంధించడం అనేది తాజా సంచలనం. ఉమాభారతి చాలా స్పష్టంగా.. ‘బాధ్యత మొత్తం మనదే’ అని నొక్కి వక్కాణిస్తుండగా.. కనీసం ఈ లేఖ అయినా మోడీ వైఖరిలో మార్పు తెస్తుందా అని పలువురు సందేహిస్తున్నారు.
పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కూడా దాని నిర్మాణానికి సంబంధించిన సమస్త ఖర్చులను కేంద్రమే స్వయంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రాజెక్టు పనులు ఆగకుండా చంద్రబాబు సర్కారు తనకు తోచినంత ఖర్చు తాను పెడుతూ పోతుండగా, మరోవైపు కేంద్రం ఈరెండేళ్లలో బడ్జెట్లలో ముష్టి విదిలించినట్లుగా అతి స్వల్ప మొత్తాలను మాత్రం కేటాయిస్తూ వచ్చింది. రాష్ట్ర నాయకులు ఎన్నిసార్లు అడిగినా కేంద్రం (అనగా మోడీ) కనీసం పెదవి విప్పడం కూడాజరగలేదు.
ఈ నేపథ్యంలో కేంద్రంలో జలవనరుల శాఖను చూస్తున్న మంత్రి ఉమాభారతి మాత్రం అంతో ఇంతో న్యాయంగా మోసం లేకుండా వ్యవహరిస్తున్నారు. పోలవరానికి పూర్తిస్థాయి నిధులు ఇవ్వాల్సి ఉన్నదంటూ ఆమె గతంలో కూడా తన అభిప్రాయాన్ని స్సష్టం చేశారు. ఆ మేరకు తాను నీతి ఆయోగ్‌కు లేఖ రాసిన వైనం కూడా గతంలో వెల్లడించారు. తాజాగా ఆమె ఏకంగా ప్రధానికి.. పోలవరానికి సంబంధించి మొత్తం నూరుశాతం ఖర్చును మనమే భరించాలని, అదే న్యాయం అని పేర్కొంటూ ప్రధానికి లేఖాస్త్రం సంధించారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చు భరించే విషయంలో ఎలాంటి మార్పులు చేసినా సరే.. అది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని కూడా ఆమె స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. మోడీ వంచనను లెక్క చేయకుండా.. ఉమాభారతి స్వతంత్రించి ధిక్కారస్వరంతోనే ఈ లేఖ రాసారని అనుకోవాలి.
అయితే కనీసం ఈ ఉమాభారతి లేఖ అయినా మోడీ బుద్ధిలో మార్పు తెస్తుందా అని తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన మాట తప్పడం. అచేతనంగా ఉండడం. చేయాల్సిన సాయం విషయంలో మీనమేషాలు లెక్కపెట్టడం వంటి విధానాలు అనుసరించకుండా మోడీ ఆలోచనల్లో మార్పు వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అంతా అనుకుంటున్నారు.