పాపం.. రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే తనదైన శైలిలో ప్రత్యర్థులపై పంచ్‌లు విసరడం నేర్చుకుంటున్నారు. ఇప్పటికే చిన్నపిల్లాడు… అంటూ ఈ పాడులోకం తనపై వేసిన అపనిందను నెమ్మదిగా కడిగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, గంగా ప్రక్షాళన పనులే ఇందుకు నిదర్శనమని మొన్నామధ్య ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. అయితే, రాహుల్ గాంధీ విసిరిన విమర్శనాస్త్రం బూమారాంగ్ తరహాలో ఆయనకే తగులుతుందని మాత్రం ఊహించలేకపోయారు. ఎందుకంటే, ఈసారి రాహుల్‌పై కోప్పడింది ఎవరో కాదు… బీజేపీ ఫైర్‌బ్రాండ్, కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతి.
రాహుల్ ప్రధానిని విమర్శించినా.. ఆమె పట్టించుకునేవారో…? లేదో..? తెలియదు కానీ.. గంగా ప్రక్షాళన పనుల ఊసెత్తేసరికి ఆమె కోపాన్ని ఆపుకోలేకపోయారు. అంతే, విలేకరుల సమావేశం పెట్టి రాహుల్‌ను చెడుగుడు ఆడుకున్నారు. కేంద్రం చేపట్టిన గంగా ప్రక్షాళన పనులు నాలుగు రాష్ట్రాల్లో చిత్తశుద్ధితో జరుగుతున్నాయని , యూపీలో పనులు మొదలు కాకపోవడానికి కేవలం అక్కడి ప్రభుత్వ అసలత్వమే కారణమని ధ్వజమెత్తారు. నాలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలోనైనా గంగా తీరం వద్దకు ఇద్దరం వెళదామని, పనులు మొదలు కాకపోతే.. నేను గంగలో దూకుతాను.. లేదంటే రాహుల్ గంగలో దూకాలని సవాలు విసిరారు. ఉమాభారతి మాటలతో అక్కడి విలేకరులంతా హతాశయులయ్యారు. రాజకీయాల్లో సవాళ్లు విసురుకోవడం సాధారణమే కానీ, ప్రాణాలకు తెగించి గంగ నదిలో దూకుదామనేంత తీవ్ర పదజాలం ఉమా వాడతారని వారు ఊహించకపోవడమే వారి ఆశ్చర్యానికి కారణం.
అక్కడితో ఊరుకోలేదు.. సవాలును స్వీకరించకుండా ఎన్నికలయ్యాక ఎప్పటిలాగా థాయ్‌లాండ్ పారిపోకుండా దేశంలోనే ఉండాలని సూచించారు. ఇన్నిమాటలన్నాక ఊరుకున్నారా? అబ్బే…! లాస్ట్ పంచ్ ఇవ్వకుండా ఉంటే ఉమాభారతి ఎలా అవుతారు…? ప్రధాని పనితీరుపై రాహుల్ చేసిన కామెంట్లు అతని చిన్నతనానికి నిదర్శనమని. ఆయనింకా ఎదగలేదని జాలిచూపారు. అంతే, పాపం ఈ మాటతో రాహుల్‌ని మరోసారి పిల్లాడిని చేశారు ఉమాభారతి. కాంగ్రెస్ యువరాజు… ఇప్పుడు ఉమాభారతి సవాలును స్వీకరిస్తాడా? ఒకవేళ ఉమా భారతి సవాలులో గెలిస్తే.. నిజంగా గంగలో దూకుతారా? అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. పాపం! రాహుల్ గాంధీ… ఈ సవాలుపై ఎలా స్పందిస్తారో!