ఈగో వేరు, ఆత్మాభిమానం వేరు. ఈగోని రకరకాలుగా చల్లార్చుకోవొచ్చేమో..? ఓసారి ఆత్మాభిమానం దెబ్బతింటే మాత్రం ఊరుకోదు. అప్పుడు అది ఈగో కంటే ప్రమాదకరంగా మారుతుంది. `ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య` కథలో కీ పాయింట్ అదే. మరి ఎవరి ఆత్మాభిమానం దెబ్బతింది? ఎందుకు? దానికి ప్రతీకారం ఏం కోరుకుంది? తెలియాలంటే `ఉ.ఉ` చూడాలి.
కథలోకి వెళ్తాం.. మహేష్ (సత్యదేవ్) ఓ ఫొటోగ్రాఫర్. తన జీవితం చాలా సింపుల్. గొడవలకు పోయే రకం కాదు. ఎదుటివాళ్లదే తప్పు అయినా, ఎందుకులే గొడవ అని సర్దుకుపోయే మనస్తత్వం కలవాడు. అలాంటిది. ఓరోజు.. అనుకోకుండా – ఓ వీధి రౌడీతో దెబ్బలాటకుదిగాల్సివస్తుంది. దెబ్బలాటలు అసలే కొత్తాయె. అందుకే.. ఊరి జనం ముందు దారుణంగా తన్నులు తినాల్సివస్తుంది. ఆ అవమాన భారాన్ని మోయలేకపోతాడు మహేష్. తనని కొట్టినవాడ్ని.. మళ్లీ కొట్టేంత వరకూ చెప్పులు కూడా వేసుకోనని శపథం చేస్తాడు. ఓ మామూలు మహేష్.. ఉగ్రరూపం దాల్చాడా? అందుకోసం ఏం చేశాడు? తన ప్రేమకథ (లు) ఎలాంటివి? ఈ విషయాలన్నీ తెరపై చూడాల్సిందే.
మహేషింటే ప్రతీకారమ్ అనే మలయాళ చిత్రానికి ఇది రీమేక్. అరకు నేపథ్యంలో సాగే కథ. పాత్రల పరిచయం, మహేష్ – స్వాతిల ప్రేమ కథ.. మధ్యలో సుహాస్ కామెడీ… వీటితో స్లో అండ్ స్టడీగా మొదలైంది. అసలు తనకు సంబంధం లేని గొడవలో… కథానాయకుడు దూరి తన్నులు తినడంతో – కథ ట్రాక్ ఎక్కుతుంది. అయితే ఈలోగా చాలా సమయాన్ని వెచ్చించాడు దర్శకుడు. కథలో కీ పాయింట్ అర్థం కావడానికి ప్రేక్షకుడికి చాలా సమయం పడుతుంది. అవమాన భారంతో కృంగిపోతున్న మహేష్‌కి – ప్రేమికురాలు హ్యాండ్ ఇవ్వడం మరో భారం. కున్ – ఫూ (కుంగ్‌ఫూ కాదు.. కున్ – ఫూనే. దాన్ని అలానే పిలవాలట) నేర్చుకోవడానికి మహేష్ చేసే ప్రయత్నాలు, ఆ తరవాత.. ఫొటోగ్రఫీ ఎపిసోడ్, మరో ప్రేమకథ.. ఇలా కథ అసలు కథ నుంచి కాస్త డీవియేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మర్చిపోయాడా? అనుకుంటున్న తరుణంలో చిన్న ట్విస్ట్ లాంటిది రివీల్ అవుతుంది. అయితే.. అది కేవలం కథానాయకుడికే ట్విస్ట్. ఆ సంగతి సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ముందే తెలుసు. ఆ పాయింట్ ని కూడా ప్రేక్షకులకు అప్పుడే రివీల్ చేసే ఉంటే మరింత బాగుండేది.
కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా మాతృకని బాగా అర్థం చేసుకున్నాడు. దాన్ని బాగా ఆడాప్ట్ చేసుకున్నాడు. అయితే.. మలయాళం ఛాయలు అక్కడక్కడ కనిస్తాయి. మాతృక ప్రభావం నుంచి కొన్నిసార్లు వెంకటేష్ మహా కూడా బయట రాలేకపోయాడేమో అన్నట్టుగా. పాత్రలన్నీ సహజ సిద్ధంగా ఉంటాయి. మేకప్ లేని మొహాలు, మెలోడ్రామా ఎరుగని నటన.. రక్తి కట్టిస్తాయి. ఫొటోగ్రఫీ కి అర్థం చెప్పిన విధానం బాగుంది. ఫొటోలోనూ ఎమోషన్ వెదికే ప్రయాణం బాగుంది. ప్రేమకథని.. సింపుల్‌గా బ్రేకప్ చేసుకున్నా, దాని వెనుక ఉండే అమ్మాయిల `కన్ఫ్యూజన్ మైండ్`, అబ్బాయిల మనోవేదన.. ఇవన్నీ బాగానే తెరకెక్కించగలిగాడు. అమ్మాయి వైపు తప్పున్నా.. `కరెక్టేనేమో` అనిపించేలా ఆ పాత్రని మౌల్డ్ చేయడం బాగుంది. చివర్లో కూడా… సినిమాటిక్ సన్నివేశాలేం లేకుండా. సింపుల్‌గా ముగించేశాడు.
అయితే… ఈ చిత్రానికి ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య అనే భారీ టైటిల్ అయితే సూటు కాలేదు. ఎందుకంటే.. మహేష్ ఉగ్రరూపం కంటే, అమాయకత్వం, మంచిదనం, మెతక వైఖరి.. ఇవే ఎక్కువగా ఆ పాత్రలో కనిపిస్తాయి. ఉగ్రరూపం చూడ్డానికి క్లైమాక్స్ వరకూ ఎదురు చూడాల్సివచ్చింది.
సత్యదేవ్ ఎంత చక్కటి నటుడో ఈ సినిమాతో మరోసారి అర్థమవుతుంది. నవరసాలు పలకడం అంటే కండరాల కదలిక కాదు.. అదో రసాయనిక ప్రక్రియ అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. దాన్ని బాగా అర్థం చేసుకున్న నటుడు.. సత్యదేవ్. ఆ పాత్రని అర్థం చేసుకుని ఓన్ చేసుకుని, అందులోనే ఉండిపోయాడు. నాటు కట్ల బాబ్జీగా.. నరేష్ నటన మెచ్చుకునేలా ఉంది. నరేష్ సజహంగా ఓ పాత్రలోకి వెళ్లిపోతే.. ఎంత బాగుంటుందో ఈ సినిమా మరోసారి తేల్చి చెప్పింది. ఆ ఇద్దర్నీ కథానాయికలు అనలేం. కానీ.. అత్యంత సహజంగా నటించేశారు. సుహాస్ గెటప్పు, అతని హెయిర్ స్టైల్, పెర్ఫార్మెన్స్.. అన్నీ బుర్ర భూగోళం అయిపోయేలా ఉన్నాయి.
అరకు అందాల్ని ఒడిసి పట్టింది కెమెరా పనితనం. పాటలన్నీ కథలో భాగంగా వచ్చేవే. డ్యూయెట్లు, పేథాస్..ల పనిలేకుండా. మాటలు బాగున్నాయి. వెంకటేష్ మహాలో సెన్సాఫ్ హ్యూమర్ అక్కడక్కడ వర్కవుట్ అయ్యింది. `జీవితంలోంచి వెళ్లిపోవాలనుకున్నవాళ్లని వెళ్లనివ్వాలి. వాళ్లు ఉన్నా వెలితిగానే ఉంటుంది` లాంటి మంచి సంభాషణలు కొన్ని తగులుతాయి. కమర్షియల్ హంగులేనీ లేని ఈ సినిమాని కాస్త ఓపికతో ఈ సినిమా చూడాలి. చూస్తే తప్పకుండా నచ్చుతుంది.
రేటింగ్: 3