పోలవరం ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పరంగా ఎన్ని కలల సౌధాలను నిర్మించుకుంటున్నదో మనకు తెలుసు. ప్రాజెక్టు వేగంగా పూర్తిచేయాలనే ఉద్దేశంతోనే ఒకవైపు తెలుగుదేశం ప్రభుత్వమే నిధులు విడుదల చేసేస్తూ… పనులను సాగిస్తున్నది. అయితే కేంద్రం తరఫు నుంచి నిధుల విడుదల విషయంలో విపరీతమైన వంచన జరుగుతున్నదనే సంగతి కూడా అందరికీ తెలుసు. పేరుకు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారే గానీ.. వాస్తవంలో నిధుల విడుదల విషయంలో ముష్టి విదిలించినట్లుగా చేస్తున్నారని.. ఈ లెక్కన ఎప్పటికీ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం లేదని భయపడే వారూ ఉన్నారు.
కేంద్రమంత్రి ఉమాభారతి విషయానికి వస్తే.. ఆమె అప్పుడప్పుడూ పోలవరం గురించి చెబుతున్న మాటలు జనానికి ఆశ కల్పిస్తుంటాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దాని నిర్మాణ బాధ్యత మొత్తం కేంద్రానిదే అని.. దానికి వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వాల్సి ఉన్నదని సత్వరం దాన్ని పూర్తిచేయాలని ఉమా భారతి గతంలో ఓ సందర్భంలో చెప్పారు. తాజాగా.. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు అవినాశ్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కూడా ఉమాభారతి పోలవరం గురించి చాలా రుచికరమైన మాటలు చెప్పారు.
2018 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉన్నదని, జాతీయ ప్రాజెక్టు గనుక.. దాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అని ఆమె అన్నారు. ఆమెకు ప్రస్తుతం ప్రాజెక్టు ఏదశలో ఉన్నదనే విషయంలో ఏ కొంచెమైనా అవగాహన ఉన్నదో లేదో గానీ.. మరో ఏడాదిన్నర కాలంలోగా ప్రాజెక్టును పూర్తిచేయాలనే లక్ష్యం ఉన్నట్లుగా ఆమె ఏ ధైర్యంతో చెప్పారో అర్థం కావడం లేదు.
అయితే కేంద్ర ప్రభుత్వం లేదా మంత్రి ఉమాభారతి పోలవరం మీద ప్రేమ కురిపించడం ఇలా మాటల్లో మాత్రమే కనిపిస్తున్నది. ఆచరణలో అసలేమీ కనిపించడం లేదు. మాటల్లో 2018కి పూర్తిచేయాలంటున్న వారు, నిధుల విడుదల సమయానికి వచ్చేసరికి మరీ ముష్టి విదిలిస్తున్నట్లుగా చేస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరిని మానుకుని, కేంద్రం మద్దతు మనస్ఫూర్తిగా ఇస్తే గనుక.. పోలవరం సత్వరం పూర్తి అవుతుందని జనం అనుకుంటున్నారు. కేంద్రం మాటలకు పరిమితం కాకూడదని, ఏపీ అవసరాలను గుర్తించిన తీరును ఆచరణలో చూపించాలని అంటున్నారు.