ఏపీలో తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల పాలనపై ప్రతిపక్ష వైసీపీ 31 పేజీల ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి తీరు వల్లనే ఆంధ్రాకి ప్రత్యేక హోదా రాకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో టీడీపీ సర్కారు ఘోరంగా విఫలమైందన్నారు. రైతు రుణ మాఫీ హామీ విషయంలో మాట తప్పారన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందనీ, కేవలం గ్రాఫిక్స్ లో మాత్రమే అమరావతిని చూపుతున్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల ముందు ప్రత్యేక హోదా సాధిస్తామని ఎంత తీవ్రంగా అయితే చంద్రబాబు మాట్లాడారో, అంతే త్వరగా చతికిలపడ్డారని ఉమారెడ్డి ఆరోపించారు. హోదా పదిహేనేళ్లు కావాలంటూ నాడు ఎలుగెత్తి అడిగారనీ, ఆ తరువాత ఎందుకు మౌనంగా మారిపోయారో ఆంతర్యం ఏంటో తెలీదన్నారు. నాలుగేళ్ల తరువాత, ఇప్పుడు కేంద్రంతో విడాకులు ఇచ్చామని అంటున్నారన్నారు. గత ఎన్నికల్లో భాజపా, జనసేన సాయంతోనే చంద్రబాబు గెలవగలిగారన్నారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలకి విడాకులు ఇచ్చేశామని అంటున్నారనీ, విడాకులిచ్చింది టీడీపీ కాదనీ… చంద్రబాబు ఏమీ చేయలేకపోయారనీ, ఇచ్చిన వాగ్దానాలేవీ నెరవేర్చలేకపోయారని చెప్పి వారు దూరమయ్యారన్నారు! అందుకే, జనసేన కూడా బండారం బయటపెట్టి, బయటకి వెళ్లిందన్నారు. ఇక, ఇతర విమర్శలు షరా మామూలే.
భాజపా-టీడీపీల మధ్య పొత్తును ఎవరు వదులుకున్నారో ఉమారెడ్డి మరచిపోయినట్టున్నారు! కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. మిత్రపక్షమైన టీడీపీ పార్లమెంటులో తొలిసారిగా ఎదురుతిరిగింది. ఆ తరువాత, కేంద్రమంత్రులు రాజీనామా, ఆ తరువాత ఎన్డీయే నుంచి పూర్తిగా బయటకి వచ్చేసింది. అంతేకాదు, టీడీపీని తాము దూరం చేసుకోలేదనీ, వారే పొత్తు కాదనుకున్నారని సాక్షాత్తూ భాజపా జాతీయ నేతలే చెబుతుంటారు కదా! భాజపా చెప్పిందైనా వారు నమ్మాలి కదా! జనసేన కూడా టీడీపీకి విడాకులు ఇచ్చేసిందని ఉమారెడ్డి అంటున్నారు. బండారం ఏదో బయటపెట్టేసిందనీ చెప్పారు. పవన్ కల్యాణ్ బయటపెట్టిన బండారం అంటూ ఏముంది..? టీడీపీని విమర్శించడం, ఆరోపణలు చేయడం.. ఇదే కదా జనసేన చేస్తున్నది.,? మరి, దాన్లో వారికి కనిపించిన, జనసేన చేసిన భారీతనం ఏముందో ఏమో..!