వైసీపీకి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుటుంబం దండం పెట్టేసింది. వయోభారంతో ఇంటికే పరిమితమైన ఉమ్మారెడ్డి వైసీపీకి రాజీనామా లాంటి ప్రకటనలు చేయలేదు కానీ ఆయన తరపున రాజకీయం చేస్తున్న అల్లుడు కిలారి రోశయ్య మాత్రం రాజీనామా చేశారు. తనకు వైసీపీలో చాలా అన్యాయం జరిగిపోయిందని బాధపడిపోయారు. తన టిక్కెట్ తనకు కాకుండా.. ఎంపీ టిక్కెట్ ఇచ్చి భారీగా ఖర్చు పెట్టించి నాశనం చేశారని ఆయన ఆవేదన.
2019లో పొన్నూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ధూళిపాళ్ల నరేంద్రను ఓడించారు. 2024లో ఆయనకు జగన్ ఎమ్మెల్యే టిక్కెట్ నిరాకరించి ఎంపీ టిక్కెట్ ఇచ్చారు.తనకు ఎంపీ టిక్కెట్ అవసరం లేదని చెప్పినా జగన్ పట్టుబట్టి పోటీ చేయించారు. కానీ మూడున్నర లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గుంటూరు ఎంపీ సీటును మొదట ఉమ్మారెడ్డి కుమారుడు వెంకటరమణకు ఇచ్చారు. అయితే ఆయన అక్కర్లేదని తేల్చేశారు. దాంతో కిలారి రోశయ్యకు ఇచ్చారు.
Also Read : ఇండియా కూటమిలోకి జగన్… అఖిలేష్ తోనే రాయబారం?
ఉమ్మారెడ్డి కుటుంబం అందరూ కలిసే రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే ఉమ్మారెడ్డి కూడా వైసీపీలో లేనట్లేనని చెబుతున్నారు. రెండు రోజుల కిందట.. గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ రావు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. సిక్కోలు నుంచి నెల్లూరు వరకూ వచ్చే రెండు, మూడు నెలల్లో పార్టీ ఖాళీ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది.