రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పదివేలు దాటిపోయాయి. కరోనా కట్టడికి కత్తి తిప్పేస్తున్నాం అని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మొదట్లో చెలరేగిపోయాయి. తేదీలు చెప్పి మరీ.. కరోనా ఫ్రీ స్టేట్ అవుతుందని ఢంకా బజాయించారు. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఓ సారి నెపం తబ్లిగీల పెట్టారు. ఇంకో సారి వలస కార్మికులపై పెట్టారు. ఇప్పుడు ఎవరిపై పెట్టాలో తెలియక మాట్లాడటం మానేశారు. ప్రస్తుతం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో రోజుకు వెయ్యి కేసులు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో అది ఐదు వందల వరకూ ఉంది. అంటే.. వైరస్ శరవేగంగా విస్తరిస్తోందని అర్థం.
మొదట్లో..ఢిల్లీలో తబ్లిగీ జమాత్ సభ్యుల వల్ల కరోనా కేసులు పెరిగాయని ఆందోళన వ్యక్తమమయింది. వారిని.. వారి కాంటాక్టులందర్నీ పట్టుకుని క్వారంటైన్‌కు తరలించి.. ఇక కట్టడిచేశామని అనుకున్నారు. ఈ లోపు వలస కార్మికులు వచ్చారు. వారి వల్ల కేసులు పెరుగుతున్నాయని కొంత కాలం చెప్పారు. ఇప్పుడు… వలస కార్మికుల్లో కరోనా కేసులు పెద్దగా బయటపడటం లేదు. ఎవరి ద్వారా సోకుతున్నాయో తెలియని వల్లనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో పది శాతం లోపే వలస కూలీలు.. విదేశాల నుంచి వచ్చిన వారికి వైరస్ ఉంటోంది. మిగతా వారంతా.. ఇతరులే. లాక్ డౌన్ సడలింపులు వల్ల.. చాలా మంది బయట తిరుగుతూండటం.. లక్షణాలు లేకపోయినా కరోనా సోకిన వారి వల్ల… ఇతరులకు సోకుతూండటంతో.. పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది.
ప్రభుత్వాలకు కరోనా కట్టడి చేయడం సాధ్యం కాదని తేలిపోయింది. వాటితో సహజీవనం చేయాలని చెప్పి చేతులెత్తేశారు. కేసులు కట్టడి చేయని విధంగా పెరుగుతున్న చోట.. ఏపీ సర్కార్ లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే మూడు నెలల లాక్ డౌన్‌తో ప్రజలు ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు.. మళ్లీ లాక్ డౌన్ అంటే సహకరించే పరిస్థితి ఉండదు. కేసులు పెడతామని బెదిరించినా ప్రజలు లెక్క చేయరు. అందుకే.. తెలంగాణ సర్కార్.. ఎలాంటి లాక్ డౌన్ ఉండబోదని చెబుతోంది. అలాంటి ఆలోచనలు కూడా చేయలేదు. మరి ఏం చేస్తే కరోనా కట్టడి అవుతుందో మాత్రం క్లారిటీ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్ తప్పి పోయింది. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండటం తప్ప చేయగలిగిందేమీ లేదు.