” పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు … ప్రతిపక్షాలకు ఉనికి లేనంత విజయాలు నమోదు చేసినా.. వారు తొమ్మిది నెలలకే రాజీనామా చేయాల్సి వచ్చింది ” అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్… ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చేసిన హెచ్చరికలు ఇప్పుడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేసే సమయానికి .. సీబీఐ కోర్టు నుంచి.. మీడియాకు..బ్రేకింగ్స్ అందాయి. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పిటిషన్‌పై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లోని అంశాలు కలకలం రేపడం ప్రారంభించాయి. అటు ఉండవల్లి తొమ్మిది నెలల లెక్క చెప్పడం.. ఇటు సీబీఐ నుంచి వ్యతిరేకంగా కౌంటర్ దాఖలు కావడంతో.. సహజంగానే.. అధికార పార్టీలో టెన్షన్ ప్రారంభమయింది.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నంత కాలం .. సీబీఐ కేసుల్లో పెద్దగా కదలిక లేదు. బీజేపీతో జగన్ లోపాయికారీగా సన్నిహిత సంబంధాలు కొనసాగించడం వల్లే… కేసుల్లో పెద్దగా కదలిక లేదని.. టీడీపీ నేతలు ఆరోపించేవారు. వారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ.. ఏమీ చేయలేకపోయారు. చివరికి.. టీడీపీ బీజేపీకి గుడ్ బై చెప్పడానికి అదీ కూడా ఓ కారణం అయింది. ఇప్పుడు.. రెండో సారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చారు. దీంతో… ఇక కేసులన్నీ తేలిపోతాయని.. వైసీపీ నేతలు సంబరాలు కూడా చేసుకున్నారు. దానికి విరుద్ధంగా ఇప్పుడు.. సీబీఐ అడుగులు వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల కిందట… విచారణకు అనుమతి దొరకలేదన్న కారణంతో.. కేసుల నుంచి విముక్తి పొందిన ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాల్సిందేనని.. సీబీఐ ఏ మాత్రం మొహమాటం లేకుండా వాదిస్తోంది.
జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడే సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలను సీబీఐ చేయడం కచ్చితంగా ప్రభావితమైన అంశమే. ఇప్పుడు సీఎంగా.. ఆయన .. అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్నవారికి పదవులు కట్టబెడుతున్నారు. సాక్షులకూ… ప్రతిఫలం చేకూరుస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుకు.. ఇలాంటి కారణాలు.. దొరికితే చాలన్న అభిప్రాయం న్యాయవాద వర్గాల్లో ఉంది. సీబీఐ తల్చుకుంటే… జగన్ బెయిల్ రద్దయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అదే జరిగితే.. ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్ వైదొలగక తప్పదు. అందుకే.. ఉండవల్లి చెప్పిన పీవీ, ఎన్టీఆర్ ఉదాహరణలతో వైసీపీ నేతల్లో గుబులు ప్రారంభమయింది.