మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈరోజు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ టిడిపి వైఎస్ఆర్సిపి పార్టీ లతో సమానంగా జనసేనకు కూడా విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. జనసేన పార్టీకి రాష్ట్రంలో మంచి బేస్ ఉందని అన్న ఉండవల్లి, సర్వేలను ఆశ్చర్య పరిచేలా జనసేన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
ఈనెల 29వ తేదీన వివిధ రాజకీయ పార్టీలతో ఉండవల్లి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిగిన నష్టం మీద ఆయన ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలకు ఆహ్వానం పంపగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ సమావేశానికి హాజరు కావడానికి ఒప్పుకోలేదని ఉండవల్లి అన్నారు. అయితే రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడ లేని పరిస్థితుల్లో కొన్ని పార్టీలు ఉన్నాయన్న ఉండవల్లి జనసేన గురించి మాత్రం సానుకూలంగా స్పందించారు. ఆ పార్టీకి రాష్ట్రంలో మంచి బేస్ ఉందని ఉండవల్లి అన్నారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ సీపీ పార్టీ లతో సమానంగా జనసేనకు కూడా అవకాశాలు ఉన్నాయని ఉండవల్లి అన్నారు. అయితే కొన్ని సర్వేలు జనసేన పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా ఉండదని పేర్కొంటున్న విషయాన్ని ప్రస్తావించినప్పుడు, దానికి స్పందిస్తూ ఉండవల్లి 2007 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో మాయావతి సొంతంగా మెజారిటీ సాధించి అధికారాన్ని చేపట్టింది అని అయితే దేశం మొత్తం మీద ఒక్క సర్వే కూడా దీన్ని ఊహించలేకపోయామని ఉండవల్లి గుర్తు చేశారు. దాదాపు 10 శాతం ఓటు బ్యాంకు కలిగిన బ్రాహ్మణులకు ఎక్కువ సీట్లు ఇవ్వడం ద్వారా మాయావతి అంతటి విజయాన్ని సాధించిందని ఉండవల్లి అన్నారు.
మొత్తానికి ఉన్నది ఉన్నట్టుగా నిష్కర్షగా మాట్లాడే ఉండవల్లి మాటలను బట్టి చూస్తే, జనసేన పార్టీ – సామాజిక సమీకరణాల కారణంగా అయితేనేమి, పవన్ కళ్యాణ్ జెన్యూనిటీ కారణంగా యువతరంలో ఉన్న అభిమానం కారణంగా అయితే నేమి, రాష్ట్రంలో జనసేన ఒక బలమైన శక్తిగా ఉందనేది, అలాగే ఎన్నికల్లో గట్టిగా ప్రభావం చూపుతుందనేది అర్థమవుతుంది.
– జురాన్