‘కేంద్రంలోని భాజపా సర్కారుపై ఎవరు అవిశ్వాస తీర్మానం పెడతారు’ అనేదే ఇప్పుడు ఆంధ్రాలో చర్చ..! తెలుగుదేశం పార్టీ తీర్మానం పెడితేనే మద్దతు ఇస్తామని వైకాపా అంటోంది. వైకాపా ఎంపీలు ముందుగా తీర్మానం ప్రవేశపెడితే… కావాల్సిన ఎంపీల మద్దతు కూడగట్టే బాధ్యత నాది అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించిన సంగతి తెలిసిందే. అందరూ ఆంధ్రా ప్రయోజనాల కోసమే అవిశ్వాసం అంటున్నారు. ఎవరు ముందుపెట్టాలీ, ఎవరు ప్రవేశపెట్టాలన్నదే రాజకీయంగా చర్చనీయమౌతోంది. ఇదే అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా స్పందించారు. రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జె.ఎఫ్.సి.లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ తో కలిసి ఏపీ ప్రయోజనాల విషయమై ఆయన పోరాడేందుకు సిద్ధమైన విషయమూ తెలిసిందే.
కేంద్రంలోని భాజపా సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇదే సరైన సమయం అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. భాజపాపై అన్ని పార్టీలకూ వ్యతిరేకత ఉందనీ, ఇప్పుడీ తీర్మానం పెడితే అది బయటపడుతుందని అన్నారు. అంతేకాదు, భాజపా నేతల్లోనే కొంతమందిలో అంతర్గత విభేదాలు ఉన్నాయన్నారు. అవిశ్వాసం పెడితే అవి కూడా వెలుగులోకి వస్తాయన్నారు. కేంద్రంపై కాంగ్రెస్, వైకాపాలు అవిశ్వాసం పెట్టేకన్నా… తెలుగుదేశం పార్టీ పెడితేనే మరింత బలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ను దగ్గర నుంచీ చూశాననీ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయనకి రహస్య ఒప్పందం ఉన్నట్టు తనకి అనిపించడం లేదని ఉండవల్లి చెప్పడం విశేషం!
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే… ప్రస్తుతం పవన్ తో కలిసి ఉండవల్లి పనిచేస్తున్నారు. అంతమాత్రాన పవన్ వ్యాఖ్యలకు మద్దతు పలకాలన్నదేం లేదు. కానీ, ఓపక్క జగన్ ను అవిశ్వాస తీర్మానానికి సిద్ధం కావాలంటూ పవన్ సవాలు చేస్తుంటే, ఆ పని ముందుగా టీడీపీ చేస్తేనే ప్రభావంతంగా ఉంటుందని ఉండవల్లి అభిప్రాయపడటం విశేషం. నిజానికి, ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెబుతున్నా.. వివిధ సందర్భాల్లో ఆయన చేసిన, ప్రస్తుతం చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీకి వ్యతిరేకంగానే ఎక్కువగా కనిపిస్తూంటాయి. అంతేకాదు, వైకాపాకి మద్దతుగా కూడా అనిపిస్తూ ఉంటాయి. అంతేనా.. ఓ దశలో ఆయన వైకాపా చేరిపోతారన్న ప్రచారం కూడా ఏడాదిన్నర కిందట జరిగింది. అవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయంటే…. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయమై జగన్ ఏం చెబుతున్నారో, దాన్ని ఏకీభవిస్తున్నట్టుగానే ఉండవల్లి వ్యాఖ్యలు ఉండటం! అదే విషయమై ఇప్పుడు పవన్ ఏం చెబుతున్నారో దాన్ని అన్యాపదేశంగా ఖండిస్తున్నట్టుగా ఉండటం!