శుభం పలకరా పెళ్లి కొడకా అంటే… ఏదో అన్నాడంటూ వెనకటికో ముతక సామెత ఉందిలెండి..! వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చంద్రబాబు సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, కేంద్రంలోని ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి వచ్చాక పరిస్థితిలో వచ్చిన మార్పు ప్రజలు గమనిస్తున్నారు. అంతకుముందు కూడా పోలవరం ప్రాజెక్టు పనుల విషయమై భాజపా సర్కారు ఎంతగా తాత్సారం చేస్తూ, ప్రతీదానికీ మోకాలు అడ్డుపెడుతూ వచ్చిన పరిస్థితి కూడా తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అనుకుంటున్నట్టుగా 2019 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామనేది జరిగే పని కాదనీ, ఇదే విషయాన్ని కాగ్ నిర్మొహమాటంగా తేల్చి చెప్పిందనీ, దానికి కారణాలను కూడా చాలా స్పష్టంగా వివరించిందన్నారు ఉండవల్లి. ఇప్పటివరకూ డిజైన్లే లేవనీ, టన్నెల్స్ లేవనీ, అవి లేనప్పుడు నీటిని ఎలా తీసుకెళ్తారనీ, గ్రావిటీ ఆధారంగా నీటిని పారించేందుకు అవసరమైన పనులేవీ ఇంతవరకూ మొదలుపెట్టలేదన్నారు. స్పిల్ ఛానెల్ అంటే… రిజర్వాయరు నిండిన తరువాత ఒలికే నీళ్లను తీసుకెళ్లేందుకు కట్టినవి అన్నారు. ఆ స్పిల్ ఛానల్స్ దగ్గరకి ప్రతీరోజూ బస్సులు పెట్టి ప్రజలను ప్రభుత్వం తరలిస్తోందనీ, ప్రపంచంలో ఇంతకంటే అద్భుతం ఇంకొకటి లేదని చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి డామ్ నిర్మాణం కూడా పూర్తయితేనే ఇవి వినియోగంలోకి వస్తాయనీ, కట్టేసినట్టుగా ప్రచారం చేసుకోవడానికి ఇవి సరిపోతాయిగానీ, అసలు పోలవరం అనేది ఎందుకు నిర్మించాలనుకున్నారో అది మొదలే కాలేదన్నారు. రోజుకి ఇంత కాంక్రీట్ పోశామంటూ చెప్తున్నారుగానీ, ఇవి వచ్చే ఏడాది నాటికి పూర్తయ్యే పనులేవీ కాదన్నారు.
సరే, ఉండవల్లి చెబుతున్నట్టుగానే పనులు పూర్తయ్యే పరిస్థితి లేదే అనుకుందాం! పూర్తి కావాలంటే ఏం చెయ్యాలో ఇలాంటి సీనియర్ నేతలు ప్రభుత్వానికి సలహా ఇవ్వొచ్చు కదా? పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి, ఏం చేస్తే పనులు వేగవంతం అవుతాయో కేంద్రానికి కూడా సూచన చెయ్యొచ్చు. అసాధ్యం, జరిగేట్టు లేదు, అవ్వదు, కుదరదు, అబ్బే వచ్చే ఏడాదికి కాదు… ఇలాంటి దృక్పథంతో పోలవరం ప్రాజెక్టును చూస్తూ, విశ్లేషిస్తూ ఉండటం వల్ల ఏం ఉపయోగం? అసాధ్యమనేది అందరూ ఈజీగా చెప్పగలిగే మాట. కాన్ని దాన్ని సుసాధ్యం చేసేందుకు చేసే ప్రయత్నం, సాగించే పోరాటం అంత సులువు కాదు. ఆ దిశగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి వీలైతే సలహా ఇవ్వొచ్చు.