వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆప్తమిత్రుడైన ఉండవల్లి అరుణ్ కుమార్.. జగన్మోహన్ రెడ్డిపై ప్రత్యేకమైన అభిమానం చూపిస్తూంటారు. ఆ విషయం.. ఆయన ఏర్పాటు చేసే ప్రెస్‌మీట్లలోనే తేలిపోతుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ఏదైనా అంశంపై విమర్శలు చేయాలనుకుంటే.. లా పాయింట్లు లాగి.. ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చెప్పేవారు. కానీ..జగన్మోహన్ రెడ్డి పాలన విషయంలో మాత్రం.. జాగ్రత్త పడమని సలహాలు ఇస్తూంటారు. అయితే.. జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చేందుకు చాలా మంది ఉన్నారు. వారి సలహాలు తీసుకుంటున్నారో లేదో … ఎవరికీ తెలియదు. మరి ఉండవల్లి మీడియా ముఖంగా ఇచ్చే సలహాలను జగన్ పట్టించుకునే అవకాశం లేదు. అయితే.. మారిపోతున్న పరిస్థితులతో ఉండవల్లి మరింత ఆందోళన చెందుతున్నట్లుగా ఉన్నారు. పరిస్థితి చేయిదాటిపోతోందని.. భావిస్తున్నట్లుగా ఉన్నారు. ఈ సారి.. హెచ్చరికలు, వార్నింగ్‌ల దగ్గరకు వచ్చేశారు. రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పెట్టిన ఉండవల్లి.. జగన పాలనా వైఫల్యాలపై విరుచుకుపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలన్నింటినీ..నిర్మోహమాటంగా ఉండవల్లి బయట పెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. ఇవన్నీ ఆయన సరిదిద్దుకోవాలన్న కోణంలోనే చేసినట్లు సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతోంది. ఈ తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వం అనేక వివాదాస్పద నిర్ణయాలతో ప్రజా వ్యతిరేకత తెచ్చుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇది మరింత బలపడితే..మొదటికే మోసం వస్తుందన్న ఉద్దేశంతో.. ఉండవల్లి వంటి శ్రేయోభిలాషులు.. ఇలా హెచ్చరికలు పంపుతున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎంత పెద్ద మెజార్టీతో గెలిచినప్పటికీ.. గతంలో ప్రభుత్వాలు తొమ్మిది నెలలకే పడిపోయాయన్న సంగతిని గుర్తు చేశారు. ఇప్పుడు.. జగన్ మోహన్ రెడ్డి తొమ్మిది నెలల పాలన పూర్తి చేసుకోబోతున్న తరుణంలో ఇలా జగన్ సర్కార్ తీరుపై .. ఒక్క సారిగా విమర్శలు గుప్పించడం.. హాట్ టాపిక్ అవుతోంది.