రెండేళ్ల జగన్ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ ఎంపీ, వైఎస్ జగన్ శ్రేయోభిలాషిగా పేరున్న ఉండవల్లి అరుణ్ కుమార్ తేల్చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశం పెట్టారు. ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ కొత్త సంప్రదాయం ప్రారంభించిందని.. విపక్షం లేకుండా సభ నిర్వహించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. కాగ్ నివేదికపై అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. ఏపీ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని.. ముందు ముందు అప్పులు కూడా పుట్టని పరిస్థితి వస్తుందని ఉండవల్లి మండిపడ్డారు. పోలవరం సహా రాష్ట్రంలో ఏ అభివృద్ధి పని జరగడం లేదన్నారు.
ఎన్టీఆర్ కుమార్తెలపై అసెంబ్లీలో కొంత మంది ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఉండవల్లి ఖండించారు. హరికృష్ణ, పురందేశ్వరితో తనకు పరిచయం ఉందని..వారుచాలా మంది వాళ్లన్నారు. అదేసమయంలో ఎన్టీఆర్ కుమార్తెలపై తాను ఎలాంటి చెడు ప్రచారాలనూ వినలేదన్నారు. కానీ ఇలా చేయడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంత దారుణంగా తిట్టినందుకే చంద్రబాబు విలపించారని.. ఆయనది డ్రామా అని తాను అనుకోవడం లేదన్నారు. అయితే అంత తీవ్రంగా స్పందించాల్సిన సమస్యేం కాదని చెప్పుకొచ్చారు. సానుభూతి రాదని చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు.
వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించకపోవడానికి ఓ కారణంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను జగన్ అసెంబ్లీలో చూపించారు. ఈ అంశంపైనా ఉండవల్లి విమర్శలు చేశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌పై ఎలాంటి ఆరోపణలు లేవని అందుకే గెలుస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. కానీ ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. అవినీతి లేనిదెక్కడో చూపించాలన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడం కనీస బాధ్యత అన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ స్వయంగా వరద బాధిత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారని.. ఆయన బాగా పని చేస్తున్నారని ఉండవల్లి తేల్చారు.
అసెంబ్లీలో సభ్యుల భాష గీత దాటిపోయిందని… ఉండవల్లి మండిపడ్డారు. చంద్రబాబును అంత దారుణంగా తిడుతున్నారని.. అలాంటి వారికి ప్రజల్లో గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఓ మంత్రి అయితే వాడు,వీడు అనడం సాధారణం అయిపోయిందన్నారు. మొత్తంగా చూస్తే ఉండవల్లికి కూడా జగన్మోహన్ రెడ్డి పాలన చూసి కడుపు మండిపోతోందన్న అభిప్రాయం వస్తోంది. ఆయన ఆపులేకపోతున్నానారు.. ప్రెస్మీట్లు పెట్టి నేరుగా జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.