మాజీ కాంగ్రెస్ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మంగళవారం కిర్లంపూడి వెళ్లి ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక హిట్లర్, ఒక ముసోలిని వంటి నియంత. ఆయన కూడా కాపు ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి ప్రయత్నాలు చేసిన ఆ నియంతలిద్దరూ చివరికి ఏమయ్యారో అందరికీ తెలుసు. ముద్రగడని మానసికంగా దెబ్బ తీయడానికే ఆయనని ఆసుపత్రిలో ఏకాకిగా చేసి నిర్బందించి ఉంచారు. కానీ ముద్రగడ ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా దీక్ష కొనసాగించి చివరికి తను అనుకొన్నది సాదించారు. ముద్రగడ చాలా చేదు అనుభవం ఎదుర్కొన్నారు. కానీ దాని వలన ఆయనకి మంచే జరిగింది,” అని అన్నారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడైన ఆయనకి కాపుల తరపున నిలబడి పోరాటం చేయడం సాధ్యం కాదు. కనుక వారి ఉద్యమంతో ఆయనకి సంబంధమే లేదు. ముద్రగడతో ఉన్నవ్యక్తిగత పరిచయం కారణంగా ఆయనని పరామర్శించదలచుకొంటే అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పరు. ప్రస్తుతం ఆయన ఏ రాజకీయపార్టీలోను లేరు. రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. కనుక ఆయన మళ్ళీ రాజకీయాలలోకి రావలనుకొంటే తప్ప చంద్రబాబుని విమర్శించవలసిన అవసరం కూడా లేదు. ఒకవేళ రాజకీయాలలోకి రావాలనుకొంటే ఆయనని వద్దని వారించేవారు ఎవరూ లేరు. కానీ రాజకీయాలకి దూరంగా ఉంటూనే రాజకీయాలు చేయడం వలన ఊహాగానాలకి అవకాశం కల్పించినట్లవుతుంది.
ఆ మద్యన ఆయనకి జగన్ నుంచి ఆహ్వానం అందినట్లు, అందుకు ఆయన కూడా సానుకూలంగానే స్పందించినట్లు వార్తలు వచ్చాయి. నేటికీ వైకాపాలో చేరలేదు కానీ జగన్ ఆలోచనలకి అనుగుణంగానే ఎప్పుడూ మాట్లాడుతుంటారు. ఆయన ఎప్పుడు నోరు విప్పినా ముఖ్యమంత్రి చంద్రబాబునే లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుండటం గమనిస్తే ఆ సంగతి అర్ధమవుతుంది. అయితే ఎన్నికలకి ఇంకా మూడేళ్ళు సమయం ఉంది కనుక ఇప్పటి నుంచే వైకాపాలో చేరడం తొందరపాటు అవుతుందనే ఉద్దేశ్యంతోనో లేక వైకాపాలో చేరి దీక్షలు, సభలు, సమావేశాలు, ఊరేగింపులకి డబ్బు తగలేసుకోవడం ఎందుకనే ఆలోచనతోనో ఆయన చేరడం లేదేమోననే అనుమానం ఉంది. అయితే అప్పటి వరకు తన ఉనికిని చాటుకొనే ప్రయత్నంగానే ఈవిధంగా విమర్శలు చేస్తున్నారని భావించవలసి ఉంటుంది.