పోలవరం ప్రాజెక్ట్ విషయంలో నిజాలు చెప్పకుండా ఏపీ ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి మభ్య పెడుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఇటీవలి కాలంలో జరుగుతున్న ప్రచారం.. కేంద్రం ఇస్తున్న షాకుల నేపధ్యంలో ఆయన నిజాలు చెప్పడానికి.. ప్రభుత్వాన్ని నిలదీయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పక్కాగా మ్యాప్‌లు పెట్టి… రికార్డులు తెచ్చి.. ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు చేస్తున్న అన్యాయం గురించి వివరించారు. కేంద్రంతో జరిగిన చర్చల వివరాలపై జగన్మోహన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పోలవరం ఎత్తు తగ్గింపుపై కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం విషయంలో ఉండవల్లి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టును 41.5 మీటర్ల ఎత్తుతోనే కడుతున్నారని తేల్చారు. దీని వల్ల.. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఏపీకి అన్యాయం చేస్తోందని ఉండవల్లి విమర్శించారు. ఇరిగేషన్ కాంపొనెంట్‌కు మాత్రమే నిధులు ఇస్తామంటోంది.. ఇరిగేషన్ కాంపొనెంట్ అంటే… పునరావాసం, నష్టపరిహారం కూడా ఉంటుందని కేంద్రమే చెప్పిందని గుర్తు చేశారు.
తెలంగాణలో ప్రాజెక్టులపై నోరెత్తితే జైలుకే అని కేసీఆర్ హెచ్చరించి.. గుట్టుగా ప్రాజెక్టులు నిర్మించేశారని అన్నారు. మనవాళ్లు ఎవరూ నోరెత్తలేదని.. వారి ఆస్తులన్నీ హైదరాబాద్ లో ఉన్నందుకే మాట్లాడలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి జగన్ వెళ్లడమే తప్పని ఉండవల్లి మండిపడ్డారు. తాగునీటి కోసం ప్రాజెక్టులు కడితే.. అభ్యంతరం పెట్టడానికి లేదని.. ఆ పాయింట్‌ను ఆసరాగా చేసుకుని… కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని అంటున్నారు. తెలంగాణ వాడుకోకపోతే.. ఆ నీళ్లన్ని ఏపీకి వస్తాయని.. ఏపీ నిల్వ చేసుకోకపోతే.. ఇక పోయేది సముద్రంలోకేనని గుర్తు చేశారు. పోలవరం విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిపోతోందని ఉండవల్లి అంటున్నారు. ఏపీ సర్కార్ కూడా ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదనేది ఉండవల్లి ఆరోపణ.
టీడీపీ హయాంలోనూ పోలవరం ప్రాజెక్టు పై ఉండవల్లి ప్రెస్మీట్లు పెట్టి విమర్శలు గుప్పించేవారు. పనులు జోరుగా సాగుతున్న సమయలో.. క్వాలిటీ సరిగ్గా లేదని విమర్శించేందుకు ఏవో పగుళ్లు వచ్చిన ఫోటోలు తెచ్చి విమర్శలు గుప్పించేవారు. ఇప్పుడు.. అసలు పనులు జరగడం అంతంతమాత్రంగా ఉన్న సమయంలో.. కేంద్రం అనేక కొర్రీలు పెడుతున్న సమయంలో ఉండవల్లి.. అసలు నిజాలు చెప్పాలని.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీడియా ముందుకు రావడం… ఆసక్తి రేపుతోంది.