వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారని జగన్ రెడ్డి శ్రేయోభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. ఇయన ఇటీవల యూట్యూట్ చానళ్లతో కూడా మాట్లాడుతూ అదే చెబుతున్నారు. విభజన చట్టం పాస్ అయి పదేళ్లు అయిన సందర్భంగా రాజమండ్రిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు హయాంలో బస్సులు పెట్టి పోలవరం ప్రాజెక్ట్ను చూపిస్తే.. పోలవరం ప్రాజెక్ట్ను చూడకుండా సీఎం జగన్ పోలీసులను పెట్టాడు’’ అని అరుణ్ కుమార్ విమర్శించారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వారానికోసారి ప్రెస్మీట్ పెట్టి పోలవరం పనులపై ఆరోపణలు చేసేవారు ఉండవల్లి. ఏవో కొన్ని ఫోటోలు చూపించి ఇవిగో క్రాకులొచ్చాయని… అదనీ.. ఇదనీ ఆరోపించారు. ఇప్పుడు పనులు జరగకపోయినా మాట్లాడటం లేదు. అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చిందేమో కానీ.. చంద్రబాబు గెలుస్తారంటున్నారు. కానీ జగన్ రెడ్డి దరిద్రపు పాలన కు జనం విసిగిపోయారని మాత్రం చెప్పడం లేదు.. చంద్రబాబు జైలుకి వెళ్లారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని చెప్పుకొచ్చారు.
విభజన చట్ట ప్రకారం జరగలేదని.. లోక్సభ వాళ్లు విడుదల చేసిన పుస్తకం ఆధారంగా కోర్టులో పిటిషన్ వేశానన్నారు. విభజన సమయంలో కాంగ్రెస్, బీజేపీ వాళ్లు 70 మంది మాత్రమే విభజన సమయంలో హాజరయ్యారని, ప్రాంతీయ పార్టీలన్ని వ్యతిరేకించాయని పేర్కొన్నారు. ఏపీ విభజన తప్పా, కరెక్టా తీర్పు చెప్పాలని సుప్రీంకోర్టుని అడుగుతున్నానని చెపపుకొచ్చారు. ఏపీ విభజన చట్టం అమలు కోసం కేంద్రాన్ని అష్టదిగ్బందం చేసి నిలదీయాలని, విభజన హామీల కోసం జగన్ ఏం సాధించారో చెప్పాలని ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు కేంద్రాన్ని నిలదీయడంలో విఫలమయ్యాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.