ఉండవల్లి అరుణ్ కుమార్ వైకాపాలో చేరడానికి ఇంకా ఎందుకు మీనా మేషాలు లెక్కపెడుతున్నారో తెలియదు కానీ ఆయన మాట్లాడే ప్రతీ ముక్క జగన్ గొంతుతో పలుకుతున్నట్లుంది. అలాగే ఆయన మాట్లాడిన ప్రతీ ముక్క తక్షణమే వైకాపా మీడియాలో ప్రత్యక్షమవుతుంటుంది. కానీ తను వైకాపాలో చేరబోతున్నట్లు ఉండవల్లి చెప్పరు. ఆయనని పార్టీలోకి రమ్మని జగన్ ఆహ్వానించరు. వారిద్దరిదీ వైకాపా-తెరాసల రహస్య అనుబంధంలాగా చాలా బలంగా అనిర్వచనీయంగా ఉంటుంది.
ప్రత్యేక హోదా కోరుతూ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష సఫలం కావాలని తను కోరుకొంటున్నట్లు ఉండవల్లి డిల్లీలో మీడియాతో అన్నారు. ఆనాడు తమ కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించిందని మళ్ళీ ఇప్పుడు బీజేపీ వంచిస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం ఎన్నికలలో గెలిచేందుకే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రజలకు నమ్మబలికిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు అది సాధ్యం కాదని ఏవో కుంటి సాకులు చెప్పి ప్రజలను మోసం చేస్తోందని ఆయన అన్నారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానంటే ఇరుగు పొరుగు రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయనే బీజేపీ వాదన నిజం కాదని, ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకొనేందుకే మోడీ ప్రభుత్వం అటువంటి కుంటిసాకులు చెపుతోందని ఉండవల్లి ఆరోపించారు. ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం కేంద్రానికి లేకపోతే అదే విషయం సూటిగా ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర ప్రజలకు మంచి సినిమా చూపించి మధ్యలో తప్పుకొన్నారని ఉండవల్లి ఎద్దేవా చేసారు. రాష్ట్రానికి ఈ దుస్థితి కలగడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత కారణమో, బీజేపీ కూడా అంతే కారణమని అన్నారు. కనుక ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ పరిష్కారం చూపవలసిన బాధ్యత బీజేపీ పైనే ఉందని అన్నారు.
ప్రత్యేక హోదా గురించి జగన్ పోరాడుతుంటే ఉండవల్లి ఆయనకి మద్దతుగా ఇంత చక్కగా మాట్లాడారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం డిల్లీలో మాట్లాడిన ఈ మాటలన్నీ అప్పుడే వైకాపా మీడియాలో వచ్చేసాయి. కానీ ఉండవల్లి ఇంకా వైకాపాలోకి ఎప్పుడు వెళ్తారో అసలు ఇంకా ఎందుకు వెనకాడుతున్నారో తెలియదు. అయినా వైకాపాలో చేరడానికి ఇంతకంటే మంచి ముహూర్తం, వేదిక ఏముంటుంది?