పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన టెండర్లు నిలిపేయాలంటూ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే అంశం ఆంధ్రాలో రాజకీయ కాక పెంచుతోంది. టెండర్లను ఆపేయాలన్నంత మాత్రాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకంత తీవ్రంగా స్పందించారనే దానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తాజా పరిణామాలపై మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. పోలవరం విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంత నిస్సహాయంగా స్పందించాల్సిన అవసరం ఏముందన్నారు. కేంద్రం దగ్గర ఈయన ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏదో ఒక అంశం దగ్గర కేంద్రానికి చంద్రబాబు దొరికేశారనీ, అందుకే గడచిన మూడున్నరేళ్లుగా రాష్ట్రానికి కేంద్ర సాయం ఆశించిన స్థాయిలో అందకున్నా భాజపాని వెనకేసుకుంటూ వస్తున్నారని ఉండవల్లి అన్నారు.
కేంద్రం దగ్గర చంద్రబాబు నాయుడు వీక్ పాయింట్ ఏంటో తనకు అర్థం కావడం లేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసు తీసుకుంటే.. కేంద్రం దగ్గర వీక్ అయిపోయేంతగా అందులో ఏమీ లేదన్నారు. రేవంత్ రెడ్డిని కాపాడటం కోసం దీన్ని చంద్రబాబు తన మీదేసుకోవాలి అనుకున్నా, ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారన్నారు. కాబట్టి, ఇప్పుడా కేసు గురించి కాంగ్రెస్ అడగదు, తెరాస ప్రశ్నించదనీ అది కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయిన కేసు అన్నారు. ఇక, కేంద్రం దగ్గర చంద్రబాబు వీక్ కావడానికి రాష్ట్రం చేసిన అప్పులు కారణమై ఉండొచ్చన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు రూ. 96 వేల కోట్లు అప్పు మన వాటాగా వస్తే, ఇప్పుడది రూ. 2 లక్షల 16 వేల కోట్లకు పెరిగిపోయిందని ఉండవల్లి చెప్పారు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టారనే లెక్కలు కేంద్రానికి సరిగా చెప్పడంలో ఎక్కడైనా వీక్ పాయింట్ ఉందేమో అని అనుమానం వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేయాలన్నది చట్టంలో ఉన్న అంశం అన్నారు. ప్రత్యేక హోదా అనేది చట్టంలో లేదు కాబట్టి ఇవ్వమనేశారనీ, కానీ పోలవరం విషయంలో అలా తప్పించుకునే అవకాశం కేంద్రానికి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన అనుమతులన్నీ తామే తెస్తామనీ, పూర్తి చేసి అప్పగిస్తామని కూడా చట్టంలో పెట్టారన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగే, ఆ పెరిగిన మొత్తాన్ని కూడా కేంద్రమే భరిస్తుందని ఆనాడు మన్మోహన్ సింగ్ హయాంలో పెట్టారన్నారు. చట్టంలో ఇంత స్పష్టంగా ఉన్నాక చంద్రబాబు నాయుడు బేలగా మాట్లాడాల్సిన అవసరం ఏముందన్నారు. పోలవరం ఆపేయమంటే ఆపేస్తామనే మాటే తప్పు అని ఉండవల్లి అన్నారు. ఆపే హక్కు చంద్రబాబుకు లేదనీ, ఆపేయమని చెప్పడానికి కేంద్రానికీ హక్కులేదని స్పష్టం చేశారు. ఇదే అంశంపై చంద్రబాబు నాయుడు కేంద్రంపై తిరగబడితే మోడీతో సహా ఎవ్వరూ ఏం చేయాలన్నారు. రాష్ట్ర భాజపా కూడా చంద్రబాబు వెంటే ఉంటుందనీ, చివరికి ప్రతిపక్ష పార్టీ వైకాపా కూడా చంద్రబాబుకు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు. మరి, ఈ అంశంపై కేంద్రంపై చంద్రబాబు తిరుగుబాటు చేస్తారా లేదా అనేది వేచి చూడాలన్నారు.
పోలవరం నిర్మాణం అనేది విభజన చట్టంలో ఉన్న అంశం కాబట్టి… ఆపే హక్కు కేంద్రానికి, ఆపేస్తామని నిర్ణయించే శక్తి రాష్ట్రానికీ లేదన్నది కచ్చితంగా మంచి పాయింటే. అయితే, ఇదే అంశమై కేంద్రంతో చంద్రబాబు ఎలా డీల్ చేస్తారనేదే ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఉండవల్లి చెప్పినట్టుగా చంద్రబాబు కేంద్రంపై పోరాటానికి దిగితే.. ఏరకంగా చూసుకున్నా ప్రజల మద్దతు ఆయనకే ఉంటుందనడంలో సందేహం లేదు. అలా కాకుండా, కేంద్రంతో దోస్తీ చెడిపోకూడదూ, మిత్రధర్మ పాటిస్తూనే పనులు చేయించుకుందాం అనే ధోరణేలోనే ఇప్పటికీ వ్యవహరించాలని అనుకుంటే… ఇతర పార్టీలకు విమర్శించే ఆస్కారం చేజేతులా ఇచ్చినట్టు అవుతుంది.