జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రారని.. ఆయన సినిమాలు చేసుకుంటేనే బెటర్ అని.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సలహా ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా… రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పెట్టే ఆయన .. కియా గొడవ జరుగుతున్న సమయంలో మరోసారి అదే పని చేశారు. ఇందులో చాలా అంశాలపై మాట్లాడినప్పటికీ.. పవన్ పై ఆయన స్టైల్లో వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం.. హైలెటయింది. పవన్ కల్యాణ్ సినిమాలు చేసుకోవాలని తాను గతంలోనే చెప్పానని.. ప్రకటించుకున్నారు. ముఖ్యమంత్రి అవుతానని ఆశ పడి.. ఎన్నికల్లో పోటీ చేసినట్లుగా ఉన్నారని.. కాకపోవడంతో.. నాలుగేళ్ల పాటు సినిమాలు చేసుకోవచ్చని.. ఆయన భావించినట్లు ఉన్నారని… పవన్ సినిమాలు చేస్తూండటంపై సెటైర్లు వేశారు.
పవన్ సినిమాలు చేయాలని అది ఆయన వృత్తి అని… ద్వంద్వార్థంలో చెప్పుకొచ్చారు. ఉండవల్లి చెప్పేది ఎలా ఉందంటే.. జగన్మోహన్ రెడ్డి వృత్తి రాజకీయం.. ఆయన ముఖ్యమంత్రి కావొచ్చు.. పవన్ కల్యాణ్ నటుడు.. నటన ఆయన వృత్తి.. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకోకూడదన్నట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు… మద్యం ధరలు సహా.. ప్రతి దానికి లాయర్‌గా తనకు తెలిసిన లాజిక్కులు తీసి మరీ.. విమర్శలు చేసే ఉండవల్లి.. జగన్ సీఎం అయిన తర్వాత శాంతించారు. ఎన్నో పరిణామాలు జరుగుతున్నా.. పోలవరం ఆగిపోయినా.. పరిశ్రమలు తరలిపోతున్నా… ఆయన ప్రశాంతంగానే ఉంటున్నారు.
అప్పుడప్పుడు జగన్ కు నైతిక మద్దతు అందిస్తున్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు వేస్తున్నారు. నిజానికి పవన్ కల్యాణ్ పై ఆయన ఇలాంటి విమర్శలు చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే… గతంలో ఉండవల్లిని పవన్ కల్యాణ్ ఎంతో గౌరవించారు. కానీ అవేమీ గుర్తు పెట్టుకోకుండా ఉండవల్లి… పవన్ కల్యాణ్ ను కించ పర్చడానికి వెనుకాడలేదు.