కాంగ్రెస్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా కాలంగా వైకాపాకు అనుకూలంగా మాట్లాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని, ఆయన చేస్తున్న పోరాటాలని అయన చాలా మెచ్చుకొన్నారు. కానీ ఇంతవరకు వైకాపాలో చేరలేదు. ఆయన మాటలను బట్టి ఏదో ఒక రోజు వైకాపాలో చేరుతారనే అందరూ భావిస్తున్నారు. కానీ అకస్మాత్తుగా ఆయన జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీ వైఖరిని తప్పు పడుతూ మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.
“1983 మరియు 85 సం.లలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దానికి ఉన్న బలం కంటే ఇప్పుడు వైకాపాకి రెట్టింపు బలం ఉంది. కానీ అది ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమయింది. జగన్మోహన్ రెడ్డి బహుశః తనపై ఉన్న సీబీఐ కేసులకు భయపడే ప్రత్యేక హోదాపై గట్టిగా పోరాడలేకపోతున్నరేమో? అధికారంలో ఉన్న తెదేపా, ప్రతిపక్షంలో ఉన్న వైకాపా రెండూ కూడా పూర్తిగా విఫలమయ్యాయి. రాష్ట్రంలో నుంచి కాంగ్రెస్ పార్టీ క్రమంగా తుడిచిపెట్టుకుపోటోంది. కనుక ప్రస్తుతం రాష్ట్రంలో శూన్యత ఏర్పడి ఉంది,” అని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి సమర్ధిస్తూ వచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్, మీడియాలో తనపై వస్తున్న ఊహాగానాలకు తెర దించేందుకే ఈవిధంగా మాట్లాడిఉండవచ్చును. లేదా ఆయన దృష్టి బీజేపీ మీద పడినందునే అధికార తెదేపా, ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా, కాంగ్రెస్ పార్టీలను విమర్శిస్తున్నారేమో? జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న సిబిఐ కేసులకి భయపడే ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడలేదని ఉండవల్లి అభిప్రాయపడుతున్నారు. కానీ ఆయన కూడా బహుశః అదే కారణంతో వైకాపాలో చేరడానికి జంకుతున్నారేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఆయనని వైకాపాలోకి రప్పించాలని ఆ పార్టీ నేతలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. కానీ ఇంతవరకు ఆయన వైకాపాకు మద్దతుగా మాట్లాడుతున్నారే తప్ప ఆ పార్టీలో చేరే ప్రయత్నం చేయలేదు.
ఒకవేళ ఈ అనుమానమే నిజమనుకొన్నట్లయితే, న్యాయవాది అయిన ఆయనే జగన్ పై ఉన్న కేసులను చూసి వైకాపాలో చేరడానికి జంకుతునప్పుడు, మరి ఆ కేసులను ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి వాటి గురించి భయపడుతుంటే అదేమీ అసహజం కాదు. న్యాయవాది అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా సీబీఐ కేసులలో రాజకీయ ప్రమేయం ఉంటుందని దృవీకరిస్తున్నట్లు మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో తెదేపా, కాంగ్రెస్, వైకాపాలు మూడు విఫలమయ్యాయి కనుక రాజకీయ శూన్యత నెలకొని ఉందని చెపుతున్నారు గాబట్టి బహుశః ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ఆయన బీజేపీకి సలహా ఇస్తున్నారేమో? అంటే బీజేపీలో చేరాలనే ఆలోచన చేస్తున్నారేమో? అని అనుమానం కలుగుతోంది. ఒకవేళ అదే నిజమయితే అది చాలా మంచి ఆలోచనే. ఆయన వంటి మంచి వక్త, పలుకుబడి ఉన్న వ్యక్తి బీజేపీలో చేరినట్లయితే అటు పార్టీకి, ఆయనకీ లాభమే.