ఉండవల్లి అరుణ్ కుమార్.. రాజమండ్రి కోసం.. గొంతెత్తారు. కర్నూలుతో పాటు రాజమండ్రిలోనూ హైకెర్టు బెంచ్ పెట్టాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చి రెండు నెలలు దాటిపోయింది. ఈ మధ్య కాలంలో పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించినా… ఉండవల్లి… కానీ ఎప్పుడూ.. రాజమండ్రికి ఫలానాది కావాలని అడగలేదు. తొలి సారి.. రాజమండ్రికి హైకోర్టు బెంచ్ కావాలని అడిగారు. వైఎస్ఆర్ హయాంలో.. రాజమండ్రిలో ఓ సారి హైకోర్టు బెంచ్ పెట్టాలనుకున్నారన్న సంగతిని ఉండవల్లి గుర్తు చేస్తున్నారు. స్వయంగా న్యాయవాది అయిన ఉండవల్లికి… ఇప్పటి వరకూ రాజమండ్రిలో హైకోర్ట్ అనే వి,యం గుర్తు రాలేదు… ఇప్పుడే ఆ టాపిక్ ఎందుకు హైలెట్ చేశారన్నది ఆసక్తికరంగా మారింది.
అప్పుడప్పుడు పెట్టే ప్రెస్మీట్లలో ఉండవల్లి.. జగన్మోహన్ రెడ్డిపై … సుతిమెత్తగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అదే పని చేశారు. పోలవరం ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నారని.. ఆ ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన నిధులను.. ఇతర వాటికి సంతర్పణలు చేశారని మండిపడ్డారు. ఇలా చేస్తే రాష్ట్ర భవిష్యత్ ఏమవుతుందని ప్రశ్నించారు. పోలవరం పూర్తి చేస్తారనే జగన్‌కు… ప్రజలు ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు. కొత్త మద్యం విధానం వల్ల.. ఏపీ మరిన్ని కష్టాల్లో పడిందని ఆయన విశ్లేషించారు. గ్రామాల్లో నాటు సారా.. పెరిగిపోతోందని.. ఇది చాలా ప్రమాదకరమని చెప్పుకొచ్చారు.
అనూహ్యంగా.. ఉండవల్లి అరుణ్ కుమార్… మీడియాపై జగన్మోహన్ రెడ్డి విధించిన అప్రకటిత నిషేధాన్ని ఖండించారు. తప్పులు చేస్తున్నప్పుడే భయపడి మాత్రమే.. పాలకులు ఇలా మీడియాను నియంత్రించాలని చూస్తారన్నారు. ఈ లెక్కన జగన్ తప్పులు చేస్తున్నారని.. ఉండవల్లి చెప్పినట్లయింది. అదే సమయంలో.. వైఎస్ఆర్ ఎప్పుడూ.. మీడియాను నియంత్రించలేదని.. సలహా ఇచ్చారు. కానీ.. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు.. వైఎస్ చేసిన పనులకు పూర్తి వ్యతిరేకంగా వెళ్తున్నారు. మండలి రద్దు సహా.. అనేక అంశాల్లో.. వైఎస్ చేసిన వ్యవహారాలకు రివర్స్‌లో చేస్తున్నారు. దీన్ని ఉండవల్లి గుర్తించలేదేమో కానీ.. ఒక్క మీడియాపై బ్యాన్ విషయంలోనే మాత్రం.. జగన్‌కు సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు.