మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ .. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అండగా నిలిచారు. పవన్ కల్యాణ్ పై జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలు చాలా తప్పని తేల్చారు. ఓ వ్యక్తి తప్పు చేస్తే తప్పు అని చెప్పడానికి చాలా పద్దతులున్నాయన్న ఉండవల్లి.. బిలో ది బెల్ట్ కొట్టే ప్రయత్నం చేయడం మాత్రం కరెక్ట్ కాదన్నారు. వ్యక్తిగత విమర్శలు రెండు రాజకీయ పార్టీలకూ.. మంచిది కాదని తేల్చారు. ఒకరికి ఉన్న పెళ్లాల గురించి.. ఆ పెళ్లాలే తేల్చుకోవాలనేది చట్టమని.. ఇతరులు జోక్యం చేసుకోవడం పద్దతి కాదన్నారు. ఇబ్బంది పడిన పెళ్లాలు న్యాయం కోసం వెళ్తే విలువ ఉంటుంది తప్ప.. ఇతరులెవ్వరికీ జోక్యం చేసుకునే హక్కు లేదన్నారు. విభజన చట్టం విషయంలో సుప్రీంకోర్టు కేసులో తాను వేసిన కేసు గురించి ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికరకమైన వ్యాఖ్యలు చేశారు.
కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ … కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల లెక్క తేల్చేందుకు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో ఉండవల్లికి పవన్ కల్యాణ్ ప్రాధాన్యం ఇచ్చారు. అప్పటి నుంచి పవన్ కల్యాణ్ గురించి ఉండవల్లి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. అయితే ఉండవల్లి మాట్లాడే విషయాల్లో లాజిక్ ఉంటుంది. తప్పుని తప్పని నిర్మోహమాటంగా చెబుతారు ఈ కోణంలోనే జగన్ వ్యాఖ్యలను తప్పుపట్టినట్లు భావించవచ్చు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్.. ఏపీ విభజన చట్టబద్ధంగా జరగలేదని వాదిస్తున్నారు. దానిపై సుప్రీంకోర్టులో కేసు వేసి.. దాని వాయిదాల కోసం తిరుగుతున్నారు.
ఉండవల్లి గతంలో జగన్ మోహన్ రెడ్డికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారన్న ప్రచారం జరిగింది. సాక్షి పత్రికలో విభజనపై వ్యాసాలు కూడా రాశారు. అమరావతిపై కూడా ఓ పుస్తకం రాశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కామెంట్లు కూడా చేశారు. పట్టిసీమ, అమరావతిపై వ్యతిరేకంగా అనేక ఆరోపణలు చేశారు. అయితే అనూహ్యంగా కొద్ది రోజుల కిందట… ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. విభజన చట్టం, హామీల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉండటంతో.. ఆయన అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం పిలిపించింది. జగన్ తో ఓ సారి సమావేశయ్యారు. పవన్ తో కలిసి పని చేశారు. చంద్రబాబుతోనూ చర్చలు జరిపారు. అందుకే తాను ఒకరికి దగ్గర.. ఒకరికి దూరం లేనంటున్నారు. కానీ ఇప్పుడు జగన్ వ్యాఖ్యలను నిస్సంకోచంగా తప్పు పట్టడంతో.. ఆయన దగ్గరగానే ఉన్నా.. జగన్ మాత్రం దూరంగా జరగడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఇవన్ని ఉండవల్లి పట్టించుకునే రకం కాదు.