“చిరంజీవి మన పార్టీలో చేరుతున్నారు. కేంద్రమంత్రి పదవి ఒకటి ఖాళీగా ఉంచండి ” అని హైలీ కాన్ఫిడెన్షియల్ సమాచారంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాసిన లెటర్ ను ఆయన అనుంగు అనుచరుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో సోనియా గాంధీకి పంపించారు. ఇది ఎప్పుడో కాదు.. ఎన్నికలు ముగిసి.. ప్రజారాజ్యానికి 18 సీట్లు వచ్చినట్లుగా తేలిన మరుసటి రోజునే. ఈ విషయం ఎవరు చెప్పారంటే.. ఇంకెవరు చెప్పినా నమ్మశక్యం కాదు.. కానీ స్వయంగా ఉండవల్లి అరుణ్ కుమారే చెప్పారు. “వైఎస్ఆర్తో” అనే పుస్తకాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ రాశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు .. తరవాతి రోజు ఏం జరిగిందో వివరించారు.
ఎవరికీ తెలియని సమాచారంతో మెయిల్ వస్తుందని దాన్ని ప్రింట్ తీసి సోనియాకు ఇవ్వాలని వైఎస్ ఉండవల్లికి చెప్పారట. కానీ ఉండవల్లికి ప్రింట్ తీయడం రాదు. పీఏ తీస్తాడు. తీస్తే చదువుతాడు. సీల్డ్ కవర్లో పెట్టినా తెలిసిపోతుందని చెప్పారట. అప్పుడు సరే అని వైఎస్ ఆ లెటర్ సీక్రెట్ చెప్పారట. అదేమిటంటే చిరంజీవి మన పార్టీలో చేరిపోతారు.. ఆయనకు కేంద్రమంత్రి బెర్త్ ఖాళీగా ఉంచమని సోనియాకు ఇచ్చే సూచనట. ఇక్కడ ఉండవల్లి ఏం చెప్పాలనుకున్నారు.. అంటే.. ఎన్నికలకు ముందే చిరంజీవి, వైఎస్ ఓ ఒప్పందానికి వచ్చారని. ఒక వేళ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కాంగ్రెస్‌కు వస్తే..పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం.. కింగ్ మేకర్ అయితే.. పొత్తు పెట్టుకోవడం అందులో భాగమని అప్పట్లో ప్రచారం జరిగింది. దాన్ని ఉండవల్లి తన పుస్తకంలో చెప్పారన్నమాట.
అయితే ఇందులో ఉండవల్లి రాసిన కొన్ని వాక్యాలు… వైఎస్ మీదే సెటైర్లు వేసినట్లుగా ఉండటంతో నిజంగానే ఇలా అని ఉంటారా అనే సందేహం కూడా వస్తుంది. ” ఏంటి సార్.. పసుపు పారాణి ఆరక ముందే ఎవరితోనే లేచిపోయినట్లు.. చిరంజీవి మనతో వచ్చేస్తున్నారంటే జనం ఒప్పుకుంటారా ? ” అని ఉండవల్లి అడిగారట. నిజానికి జనం ఒప్పుకుంటారో లేదో తర్వాత విషయం కానీ.. పసుపు పారాణి ఆరక ముందే ఎవరితోనే లేచిపోయినట్లు అనే పదం మాత్రం వైఎస్‌పై సెటైరే. ఎందుకంటే రెడ్డి కాంగ్రెస్ తరపున తొలి సారి గెలిచిన వైఎస్ .. వెంటనే పార్టీ ఫిరాయించారు. దీన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన రెడ్డి కాంగ్రెస్ నేత కాసు బ్రహ్మానందరెడ్డి ” మంగళసూత్రంతో (మధుపర్కాలతో) సహా లేచిపోయిన శాసనసభ్యులలో ఒకరు వై ఎస్ రాజశేఖర రెడ్డి” అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే తరహాలో తాను అన్నానని ఉండవల్లి చెప్పడం కాస్త అతిశయోక్తే.