తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైసీపీలో రోజు రోజుకు వివాదాస్పదం అవుతున్నారు. ఆమెకు వ్యతిరేకంగా పార్టీ నేతలు తరచూ గళమెత్తడమే కాదు.. నేరుగా జగన్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట.. రవి అనే … గ్రామస్థాయి నేత.. తనకు ఎమ్మెల్యే శ్రీదేవి రూ. కోటి ఎగ్గొట్టారని.. ఎన్నికల ఖర్చుల కోసం అప్పులు చేసి ఇస్తే.. ఇప్పుడు పదవి ఇప్పిస్తా.. తీసుకుని కామ్‌గా ఉండమని హెచ్చరిస్తున్నారంటూ… వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. అది వైరల్ అయింది. జగన్ దృష్టికి వెళ్లిందో లేదో తెలియదు. తాజాగా ఆమె ఓ సీఐను అసభ్య పదజాలంతో దూషిస్తున్న ఆడియో బయటకు వచ్చింది. దీనిపై పోలీసు వర్గాల్లోనే చర్చ ప్రారంభమయింది. శ్రీదేవి వ్యవహారశైలి మొదటి నుంచి వైసీపీలో ఇబ్బందికరంగానే ఉందనే చర్చ నడుస్తోంది.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ నందిగం సురేష్‌తో ఆమెకు విబేధాలు ఏర్పడ్డాయి. ఇసుక తరలింపు విషయంలో… ఇద్దరు ఎవరి ఆధిపత్యానికి వారు ప్రయత్నించడంతో వివాదం హైకమాండ్ వద్దకు వెళ్లింది. అక్కడ ఇద్దరూ పరిష్కరించుకున్నారు కానీ.. విబేధాలు మాత్రం సమసిపోలేదు. ఇద్దరూ ఇప్పటికి మాట్లాడుకోరని చెబుతూంటారు. ఆ తర్వాత చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీతోనూ ఆమెకు విబేధాలు ఏర్పడ్డాయి. మంత్రి పదవి రేసులో ఇద్దరూ ఉన్నారని ప్రచారం జరగడంతో శ్రీదేవి ఆమెతో దూరంగా ఉంటున్నారని చెప్పుకున్నారు.
పార్టీ క్యాడర్‌తో సరిగ్గా ఉండకపోవడం… కులాల పేరుతో ప్రతీసారి అవసరం లేకపోయినా రాజకీయాలు చేస్తూండటం.. కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతూండటంతో.. వైసీపీ సానుభూతిపరులు కూడా అసంతృప్తితో ఉంటున్నారు. ఆమె కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. తనపై వస్తున్న ఆరోపణలను తిప్పకొట్టాలని.. తన నియోజవర్గంలోని అన్ని మండలాల నేతలను కోరినా… ఒకరిద్దరు తప్ప పెద్దగా ఎవరూ స్పందించడం లేదు. దీంతో.. ఉండవల్లి శ్రీదేవి వ్యవహారశైలి వైసీపీ హైకమాండ్‌కు సైతం ఇబ్బందికరంగా మారింది.