తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా బారిన పడ్డారు. కొద్ది రోజుల కిందటే పాజిటివ్‌గా తేలినప్పటికీ… ” వస్తుంది.. పోతుంది… నిరంతర ప్రక్రియ ” అన్న భావనతో పెద్దగా ట్రీట్ మెంట్ చేయించుకోలేదు. ఆ నిర్లక్ష్యం వల్లే ఆమెకు పరిస్థితి సీరియస్‌గా మారింది. ఊపిరి తిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఊపిరి పీల్చలేని పరిస్థితికి వచ్చింది. చివరి దశలో గుర్తించి.. ఆమెను హుటాహుటిన హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన హాస్పిటల్ అయిన కాంటినెంటల్ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. ఆమెకు వైద్యులు అత్యున్నత వైద్యం అందిస్తున్నారు.
ఉండవల్లి శ్రీదేవి ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు వాకబు చేస్తోంది. ఇప్పటికే కరోనా బారిన పడి.. వైరస్ తగ్గినప్పటికీ… తీవ్రమైన అనారోగ్యం తలెత్తడంతో బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే చనిపోయారు. ఇప్పుడు తాడికొండ ఎమ్మెల్యేకు సీరియస్‌గా ఉందని తెలియడంతో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వైద్యంపై ఫాలో అప్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి ఉండవల్లి శ్రీదేవి డాక్టర్. ఆమె భర్త కూడా డాక్టరే. హైదరాబాద్‌లో వారికో సొంత ఆస్పత్రి కూడా ఉంది.
డాక్టర్ అయినప్పటికీ.. ఆమె కరోనాను సీరియస్‌గా తీసుకోలేదు. అది వస్తుంది.. పోతుదని.. భావిస్తూ.. పారాసిటమాల్ వేసుకుని .. లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాడికొండ ప్రజలు ఆమె ఆరోగ్య సమాచారం కోసం ఉత్సుకతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో వైసీపీ కోసం ఆమె వినూత్న ప్రచారం చేశారు. రాజధాని గ్రామాల రైతులు, ప్రజలు కూడా ఆమె కోలుకోవాలని కోరుకుంటున్నారు.