మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్… సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపే వరకూ నిద్రపోయేలా లేరు. జగన్‌ను బీజేపీపై పోరాడాలని ప్రెస్ మీట్ పెట్టిన ప్రతీ సారి రెచ్చగొడుతున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ఉండవల్లి ఈ వారం కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అందులో చాలా విషయాలు మాట్లాడినా… జగన్మోహన్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలే హైలెట్ అవుతున్నాయి. ” అవినీతి కారణంగానే కేంద్ర ప్రభుత్వంతో పోరాడలేకపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఎందుకు భయపడాలి” అని ఉండవల్లి ప్రశ్నించారు.
‘‘పోతే జైలుకే పోతారు. జైలేమైనా కొత్తా నీకు… జైలుకెళ్లు. దేనికి భయపడడం. వెనకడుగు వేస్తే… అది మీ తప్పుగానే జనం భావిస్తారు. ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చిన రాష్ట్ర ప్రజల వెంట నిలబడతారా… లేదా మోదీ, అమిత్ షాల మాటలు వింటారా అన్నది తేల్చుకోండి. జగన్ రెడ్డి తిరగడబడతాడనే జనం అనుకుంటున్నారు. రండి జగన్.. పార్లమెంట్ వేదికగా పోరాడండి. 51 శాతం ఓట్లు, 151 సీట్లు ఏ రాష్ట్రంలోనూ రాలేదు. భయపడటం వైఎస్ఆర్ కొడుకు చేయాల్సినది కాదు. ’’ అని ఉండవల్లి సూటిగా సలహా ఇచ్చారు. జగన్‌ను బీజేపీపై పోరాడాలని ఉండవల్లి సలహా ఇవ్వడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఇచ్చారు. అయితే వైసీపీ నేతలు.. ఎవరూ స్పందించలేదు. ఉండవల్లి సలహాలు.. వైసీపీ నేతలకు నచ్చడం లేదేమో కానీ అసలు స్పందించడం లేదు.
ఉండవల్లి.. జగన్ శ్రేయోభిలాషిగానే భావిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ దానికి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించారు. ఓ సారి మద్యం క్వార్టర్ బాటిల్ పట్టుకుని ఆయన చేసిన విశ్లేషణ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్‌గానే ఉంటుంది. ఇప్పుడు ఉన్న రేట్లలో అలాంటి విశ్లేషణ చేయాలన్న సూచనలు కూడా వస్తూంటాయి. అయితే ఉండవల్లి పట్టించుకోరు. వీలైనంత వరకూ జగన్‌కు మేలు చేసే సలహాలే ఇస్తారు. కానీ వాటిని తీసుకోవడమా లేదా అన్నది జగన్ ఇషఅటం. మరి ఈ సారి అయినా పరిశీలిస్తారో లేదో..!