ఆంధ్రప్రదేశ్ లో నవ నిర్మాణ దీక్ష జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాతపాడే మళ్లీ మళ్లీ పాడుతూ ఉన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారనీ, ఏపీ విభజనను అడ్డుకునేందుకు తాము ఎంత ప్రయత్నించినా కాలేదనీ చెబుతున్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ ను ఆదరించకూడదనీ, ఆ పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు వెళ్తే రాష్ట్రానికి ద్రోహం చేసినవారే అవుతారంటూ తాజాగా చంద్రబాబు విమర్శించారు. విభజన కష్టాలకు సంబంధించి మొదట్నుంచీ ఏదైతేనే చెబుతూ వస్తున్నారో ఇప్పుడు కూడా అవే వల్లెవేస్తున్నారు. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రసంగాలపై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. చంద్రబాబు ఓ మాంచి సలహా కూడా ఇచ్చారు!
విభజన కష్టాలూ నష్టాలూ అంటూ ఆంధ్రాలో కబుర్లు చెప్పడం కాదనీ, సమస్యలకు పరిష్కారం లభించేలా లోక్ సభలో చర్చ జరిగేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే బాగుంటుందని ఉండవల్లి సూచించారు. పార్లమెంటు తలుపులకు గొళ్లెం పెట్టి మరీ రాష్ట్రాన్ని విభజించారనీ చంద్రబాబు వాపోతుంటారనీ… దాన్ని సరిచేసేందుకు తెలుగుదేశం ఎంపీలు చేసిన ప్రయత్నం ఏపాటిదో వివరించాలని ఉండవల్లి అన్నారు. పార్లమెంటులో ఈ విషయాలు ఎందుకు మాట్లాడం లేదనీ, చట్ట సవరణ కోసం తెలుగుదేశం ఎందుకు ప్రయత్నించడం లేదని నిలదీశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే చంద్రబాబుకి చాలా భయమనీ, ప్రధాని మోడీ ముందు కూడా భయపడుతూ ఉంటారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. విభజన గురించి పార్లమెంటులో మాట్లాడిస్తే ఓటుకు నోటు కేసు తీగను మళ్లీ బయటకి లాగుతారన్న భయంతోనే ఏపీ సమస్యలపై రాజీపడుతున్నట్టు అర్థం చేసుకోవాలని ఉండవల్లి చెప్పారు. ఏపీ అభివృద్ధి కోసం దీక్షలు చేయాల్సింది ప్రజలు కాదనీ, ముఖ్యమంత్రి మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.
ఓరకంగా ఉండవల్లి సూచన బాగానే ఉంది! విభజన కష్టాల గురించి ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయిలో కచేరీలు పెట్టుకుని బాధపడుతూ ఉంటే ఏం ప్రయోజనం..? రాష్ట్రం పేదరికంలో ఉందీ, అడ్డగోలుగా విభజించేశారూ, కేంద్ర సాయం చాలదూ, కాంగ్రెస్ మోసం చేసిందీ, అందుకే ఈ కష్టాలు.. ఇలాంటివి గత మూడేళ్లుగా ప్రజలు వింటూనే ఉన్నారు. గడచిన ఏడాది నవ నిర్మాణ దీక్షలో కూడా ఇదే ప్రసంగ పాఠాన్ని చంద్రబాబు వినిపించారు. మొన్నమొన్నటి మహానాడులో కూడా ఇవే చెప్పారు. ఇప్పటికైనా, ఈ కష్టాలపై పార్లమెంటులో ప్రస్థావించే దిశగా ప్రయత్నిస్తే బాగుంటుంది. సమస్యలు ఉన్నాయని ప్రజలకు ఎన్నాళ్లు చెబుతూ వస్తారు..? వాటి పరిష్కారం కోసం తెలుగుదేశం చేసింది ఏముంది అనే ప్రశ్న ఉంటుంది కదా! 2019 ఎన్నికల వరకూ ఇలా కష్టాలను నెమరు వేసుకుంటూ టైం పాస్ చేసేస్తారా…?